హైదరాబాద్: గత మూడురోజుల పరిణామాలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు మరో తప్పటడుగు వేస్తున్నట్లే కనబడుతోంది. 1999లోగానీ, 2014లోగానీ తనకు అండగా నిలబడింది కాపులేనంటూ గత రెండురోజులుగా చెప్పుకొస్తూనే – తన అనాలోచిత నిర్ణయాలతో గణనీయసంఖ్యలో ఓట్లు ఉన్న ఆ సామాజికవర్గాన్ని చేజార్చుకునేట్లు కనిపిస్తున్నాయి. తునిలో విధ్వంసానికి సంబంధించి తుని రూరల్ పోలీస్ స్టేషన్లో 57 కేసులు, తుని టౌన్ పోలీస్ స్టేషన్లో 7 కేసులు నమోదయ్యాయి. వీటన్నింటిలో కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని ఏ1గానూ, ఆ సభకు హాజరైన సీనియర్ కాపు రాజకీయ నాయకులు పళ్ళంరాజు, కన్నా లక్ష్మీనారాయణ, సి.రామచంద్రయ్య, వట్టి వసంతకుమార్, జ్యోతుల నెహ్రూ తదితరులను నిందితులుగానూ బుక్ చేశారు.
జరిగిన పరిణామాలను వరసగా గమనిస్తే, ఆదివారం ఘటన జరిగిన రోజు సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ, ఈ అల్లర్లు చేసింది కాపులు కాదని చంద్రబాబు చెప్పారు. వారి గురించి తనకు బాగా తెలుసని, ముఖ్యంగా గోదావరి జిల్లాల కాపులు పౌరుషాలకు పోరని, సౌమ్యులని అన్నారు. దీనివెనక ఖచ్చితంగా అరాచక శక్తులు ఉన్నాయని చెప్పారు. ఒక నేరగాడు ఇవన్నీ చేయిస్తున్నాడని, అతని తండ్రి హైదరాబాద్‌లో గతంలో ఇలాంటివి చేయించాడని ఆరోపించారు. ముద్రగడపై పెద్దగా విమర్శలు చేయలేదు. కాపులను బీసీల్లో చేర్చటానికి జీఓ ఇమ్మంటే ఇస్తానని, కానీ దాని వలన ఉపయోగం లేదని చెప్పారు.
సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ముద్రగడ, 2 గంటల ప్రాంతంలో జగన్ మాట్లాడారు. ముద్రగడ కిర్లంపూడిలో తన ప్రెస్మీట్లో మాట్లాడుతూ ఈ అల్లర్లు చేయించింది తెలుగుదేశం పార్టీ వారేనని అన్నారు. వారికి తాము సభను నిర్వహించుకోవటమే ఇష్టం లేదని ఆరోపించారు. తన సభకు ఆర్టీసీ బస్సులను, స్కూల్ బస్సులను ఇవ్వనీయకుండా చేశారని, సభికులకోసం వంట చేయటానికి జాగా కూడా ఇవ్వనీయలేదని విమర్శించారు.
తర్వాత 3 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన జగన్, తనను నేరగాడన్న చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఏకవచనంతో సంబోధిస్తూ, ముఖ్యమంత్రి చీప్‌గా మాట్లాడుతున్నారని, నంబర్ వన్ క్రిమినల్ చంద్రబాబేనని అన్నారు. కాపులకు ఎన్నికలముందు హామీలను ఇచ్చి నెరవేర్చలేదని ఆరోపించారు. కాపుల డిమాండ్లకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. “మనం చేసే పోరాటం పూర్తిగా సమంజసమైనది, రిజర్వేషన్ సాధనకు కలసికట్టుగా అడుగులు వేద్దాం” అంటూ కాపులపై ప్రేమానురాగాలు ప్రదర్శిస్తూ, సంఘీభావం ప్రకటించారు.
చంద్రబాబు సోమవారం సాయంత్రం మళ్ళీ విజయవాడలో మీడియాతో మాట్లాడారు. అయితే ముద్రగడపట్ల ఆదివారంనాడు ప్రదర్శించిన వైఖరికి, సోమవారంనాటికి తేడా కనిపించింది. తుని అల్లర్ల వెనక ఉన్నది తెలుగుదేశమేనని ముద్రగడ ఆరోపించటం చంద్రబాబుకు కిర్రెక్కించినట్లుంది. జగన్‌ను, ముద్రగడను ఒకేగాటన కడుతూ విమర్శలు చేశారు. వారిద్దరూ ఒకే రకంగా మాట్లాడుతున్నారని అన్నారు. కాపుల రిజర్వేషన్‌పై ఇన్నాళ్ళూ గమ్మున కూర్చున్నవాళ్ళు ఇప్పుడు రాజకీయ దురుద్దేశ్యాలతో ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతున్నారంటూ ముద్రగడపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మంచి, మర్యాద లేకుండా జగన్ తనగురించి అసభ్యంగా, అగౌరవంగా మాట్లాడుతున్నారని వాపోయారు. తాను 40 ఏళ్ళ అనుభవం కల సీనియర్ నాయకుడినని, ఎక్కడికివెళ్ళినా తనను అందరూ గౌరవిస్తూ ఉంటారని, తన అనుభవం అంత వయస్సు లేని జగన్ తన గురించి అగౌరవంగా మాట్లాడతున్నాడని మండిపడ్డారు.
కాపుల సమస్య ఇప్పుడు మొదలవటానికి కారణం ఒక రకంగా చంద్రబాబే. 2014 ఎన్నికలకు ముందు తన పొలిటికల్ కెరీర్ కు లైఫ్ అండ్ డెత్ అన్న పరిస్థితి ఏర్పడటంతో మ్యానిఫెస్టోలో అన్నివర్గాలకూ ఇచ్చినట్లే కాపులకు కూడా అలవికాని హామీలిచ్చేశారు. కాపులను బీసీల్లో చేరుస్తామని, వారి సంక్షేమంకోసం సంవత్సరానికి వెయ్యికోట్లు ఇస్తామని చెప్పారు. అవి నెరవేర్చటంలేదనే ముద్రగడ ఆందోళన ప్రారంభించారు. ప్రభుత్వానికి మూడు లేఖలు కూడా రాశారు. నాలుగు నెలలనాడే తుని మహాసభ గురించి ప్రకటించారు. ముద్రగడ మాటంటే కాపుల్లో మంచి గౌరవం ఉందన్నది అందరికీ తెలిసిన విషయమే. అయినా సభకు జనం పెద్దసంఖ్యలో హాజరవుతారని అంచనా వేయలేదు. సభకు భద్రతాపరంగా సరైన చర్యలు తీసుకోలేదు. సరే ఏదో జరిగిపోయింది. ప్రాణనష్టం జరగకపోవటం ఒకరకంగా అదృష్టమే. ఇప్పటికైనా డేమేజ్ కంట్రోల్ మొదలుపెట్టాల్సింది. ముద్రగడనో, ఇతర కాపు పెద్దలనో చర్చలకు పిలిచి సంక్షోభం పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సింది. అల్లర్లకు తెలుగుదేశంపార్టీ వారే కారకులని ముద్రగడ అన్నారని ఆయనపైనే ప్రభుత్వ పెద్దలు ఎదురుదాడికి దిగారు. సభ నిర్వహణకు ఆటంకాలు కల్పించారనో లేక ఎవరైనా తప్పుడు సమాచారం ఇవ్వటంవలనో గానీ తెలుగుదేశంవారిపైన ముద్రగడ ఆరోపణలు చేశారు… ఇది ఆయనవైపునుంచి తప్పే. అయితే ప్రభుత్వమైనా సంయమనం పాటించాల్సింది. అల్లర్లు చేసింది కాపులు కాదంటూనే ముద్రగడపై, కాపు సీనియర్ రాజకీయ నాయకులపై ప్రధాన నిందితులుగా కేసులు నమోదు చేసింది. కాపు ప్రతినిధులతో సమావేశాలంటూ తెలుగుదేశంలో ఉన్న కాపులతో, డబ్బుకు అమ్ముడవుతాని పేరున్న కాపు నాయకుడు పిళ్ళా వెంకటేశ్వరరావుతో నిన్న విజయవాడలో ఒక సమావేశం నిర్వహించి కాపులను బుజ్జగించేశామని, వారంతా తమ వెనకే ఉన్నరనుకుని మురిసిపోతోంది. ఆ సమావేశంలోనే తుని ఘటనకు సంబంధించి అమాయకులపై కేసులుపెట్టకుండా చూస్తామని హామీ ఇస్తూనే, అల్లర్లకు సంబంధంలేని ముద్రగడ, తదితరులపై కేసులు నమోదు చేయటం వలన కాపులకు ఏ సంకేతాలు వెళతాయో అర్థం చేసుకోలేకపోతోంది ప్రభుత్వం. ముద్రగడ వైసీపీకి అమ్ముడుపోయాడని, వైసీపీ ఆడించినట్లు ఆడుతున్నాడని ఊహించుకుని ఆయనపై కసి పెంచుకుంటోంది. ముద్రగడ నిజాయితీని కాపులేకాదు గోదావరి జిల్లాలోని ఎవరూ శంకించరన్నది అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తిపై కక్షసాధింపుచర్యలకు దిగితే ఆ సామాజికవర్గం హర్ట్ అవ్వకుండా ఉండదు. అదే జరిగితే ఇప్పటివకు తమకు కాపుగాసిన బలమైన ఓటుబ్యాంకును టీడీపీ చేజార్చుకోవటమే అవుతుంది… తన వేలితో తన కంట్లోనే పొడుచుకున్నట్లవుతుంది. దీనికి బదులు ముద్రగడను చర్చలకు పిలవటం, అటు కాపులు, ఇటు బీసీలతో చర్చల ప్రక్రియను ప్రారంభించటం వంటి చర్యలు తీసుకుంటే నిర్మాణాత్మకంగా ఉంటుంది. బీసీలను ఎందుకంటే – కాపులను బీసీల్లో చేర్చితే తాము ఉద్యమం ప్రారంభిస్తామని బీసీ సంఘాల నాయకులు ఇవాళ విజయవాడలో అల్టిమేటమ్ ఇచ్చారు కాబట్టి.
ఏది ఏమైనా కాపులను బీసీల్లో చేర్చాలన్నదానిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఈ సంక్షోభానికి పరిష్కారం లభిస్తుంది. ఆయన చిత్తశుద్ధిపై టీడీపీలోని కాపునేతలే సందేహాలు వ్యక్తం చేస్తున్నారంటున్నారు. తుని వ్యవహారంపై మొన్న రెండు రోజులూ మీడియాతో మాట్లాడేటపుడు కాపులకు తనంటే ప్రేమని, వారంటే తనకూ ప్రేమని చెబుతూనే, వారికి రిజర్వేషన్ కల్పిస్తే బీసీలేమంటారో అనే ఒక మాట కూడా వాడారని చెబుతున్నారు. ఇది బీసీలను రెచ్చగొట్టటమే అవుతుందని అంటున్నారు. దానికి తగ్గట్లే బీసీ సంఘాలు ఇవాళ ప్రభుత్వానికి అల్టిమేటమ్ ఇచ్చాయి. బీసీలు తెలుగుదేశానికి మొదటనుంచీ వెన్నెముకగా ఉన్నాయి. కాపులకు రిజర్వేషన్లిస్తే వారి ఆగ్రహానికి గురికాక తప్పదని బాబాకు తెలుసు. అందుకే బాబు ఇలా గో(డమీద)పి(ల్లి)లా డాన్స్‌లు చేస్తున్నాడనే వాదన బలంగానే వినబడుతోంది.