చంద్రగిరి నియోజక వర్గంలో ఐదు పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ విషయమై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు జరిగిపోయిన 34 రోజుల తరువాత రీ పోలింగ్ జరపడేమేంటీ, ఏదైనా సమస్య ఉందనుకుంటే పోలింగ్ జరిగిన వెంటనే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు అనేది టీడీపీ విమర్శ. ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతున్న కుట్రగా, ఆ నియోజక వర్గంలో టీడీపీని గెలుపును ప్రభావితం చేసే చర్యగా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యలో తనపై వినిపిస్తున్న ఆరోపణలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం స్పందించారు. చంద్రగిరిలో రీపోలింగ్ విషయంలో తనపై విమర్శలు చేయడం సరికాదన్నారు. తన బాధ్యతను తాను నిర్వర్తించానని ఆయన అన్నారు.
చంద్రగిరి నియోజక వర్గంలో ఏడు గ్రామాలకు చెందిన ఎస్సీలు ఎన్నికల్లో ఓటు వెయ్యలేదన్న ఫిర్యాదు తనకు అందిందన్నారు. దానిలోని తీవ్రతను గుర్తించి, ఎన్నికల సంఘానికి పంపించానన్నారు. పౌరులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనీ, ఓటు హక్కును ప్రజలు సక్రమంగా వినియోగించుకునే విధంగా చూడాల్సిన బాధ్యత అధికారులపై తమ ఉందనీ ఆయన అన్నారు. చంద్రగిరిలో రీపోలింగ్ జరగాలా వద్దా అనేది తన పరిధిలోని నిర్ణయం కాదనీ, ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారమే అది జరుగుతుందన్నారు. రీపోలింగ్ జరగడానికి తమదే తప్పు అన్నట్టుగా విమర్శలు చేయడం సరికాదన్నారు. ఇలాంటి విషయాల్లో చూసీ చూడనట్టుగా అధికారులుగా తాము వ్యవహరించలేమనీ, గుడ్డిగా పాలన జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేమన్నారు.
అయితే, ఇక్కడ సమస్య అంతా… ఎన్నికల జరిగి నెలరోజులు దాటిపోయాక రీపోలింగ్ ఏంటనేదే ప్రశ్న? ఒకవేళ చంద్రగిరిలో ఎస్సీలు ఓటు వెయ్యాలేని పరిస్థితి ఉన్నప్పుడు… ఎన్నికలు జరిగిన మర్నాడే అక్కడి పోలింగ్ అధికారులు ఫిర్యాదులు చెయ్యాలి కదా! ఎందుకు చెయ్యలేదు అనేది ప్రశ్న? ఇలాంటి చూసీ చూడనట్టుగా వదిలేయలేమని ఇప్పుడు చెప్పుతున్న సీఎస్… ఇన్నాళ్లూ ఏం చేశారనేదీ ప్రశ్నే? చంద్రగిరిలో సమస్య ఇన్నాళ్లూ ఆయన దృష్టి రాలేదా, కిందిస్థాయి అధికారులు ఆయన దృష్టికి తీసుకురాలేదా, ఏడు గ్రామాలకు చెందినవారు ఓటెయ్యని పరిస్థితి ఉంటే… స్థానికంగా ఉన్న రాజకీయ పార్టీలు ఇన్నాళ్లూ ఏం చేశాయి..? ఇలా అన్నీ ప్రశ్నలే! ఈ నేపథ్యంలో ఈనెల 19న రీపోలింగ్ కి అంతా సిద్ధమౌతూ ఉంది.