భాజపా వ్యతిరేక పార్టీలను ఒక గూటి కిందకి చేర్చేందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ప్రయత్నమే చేస్తున్నారు. దీన్లో భాగంగా ఆయన నిన్నట్నుంచీ ఢిల్లీలో బిజీబిజీగా ఉంటున్నారు. నిన్న ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం, అక్కడ కాంగ్రెస్ నేత అభిషేక్ మనుసింఘ్వీతో సమావేశమయ్యారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో కూడా భేటీ అయ్యారు. ఈ ఇద్దరితోనూ పొత్తుల అంశమే ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. భాజపాకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను వీలైనంత త్వరగా ఒక కూటమి కిందికి తీసుకుని రావాలనీ, ఎన్నికల ఫలితాలు భాజపాకి అనుకూలంగా ఉండవని ఆ పార్టీ వారు కూడా గ్రహించారనీ, కాబట్టి భాజపా కూడా కొత్త పొత్తుల కోసం రంగంలోకి దిగే అవకాశం ఉందని చంద్రబాబు ఈ నేతలతో చర్చించినట్టు సమాచారం. ఇదే అంశమై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో కూడా చంద్రబాబు సమావేశమయ్యారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చంద్రబాబు నాయుడు భేటీ ఇవాళ్ల ఉంది. గడచిన పది రోజులుగా వరుసగా జరుగుతున్న ఈ భేటీలకు సంబంధించిన సారాంశాన్ని రాహుల్ కి చంద్రబాబు వివరిస్తారని సమాచారం. నిజానికి, ఓవారం కిందట రాహుల్ ని చంద్రబాబు నాయుడు కలిశారు. ఆ సందర్భంగానే ఇతర పార్టీలతో మాట్లాడే బాధ్యతను చంద్రబాబుకు రాహుల్ అప్పగించారనీ కథనాలొచ్చాయి. దాన్లో భాగంగానే వరుసగా నేతలతో సమావేశమౌతూ వచ్చారని అనుకోవచ్చు. ఇంకోపక్క, ఇదే రోజు సాయంత్రం బీఎస్పీ అధినేత్రి మాయావతి, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తో కూడా చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు.
ఎన్నికల ఫలితాలకు ముందే భాజపా వ్యతిరేక పక్షాల సమావేశం ఉంటుందా లేదా అనేది పక్కనపెడితే… ఫలితాల తరువాత అనుసరించాల్సిన వ్యూహంపై ముందుగానే ఒక స్పష్టతకు రావాలనేది చంద్రబాబు నాయుడు ప్రయత్నంగా కనిపిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ లాంటివారు కూటమిలో కాంగ్రెస్ ఉన్నా ఫర్వాలేదనే ఒక అభిప్రాయానికి వచ్చారు. కాంగ్రెస్ కీ భాజపాకీ సమాన దూరం పాటిస్తూ వస్తున్న మాయావతి, అఖిలేష్ లను ఒప్పించడమే ఇప్పుడు అసలైన విషయం. అయితే, ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ, ఎవరి సంఖ్యాబలం ఏంటనేది తేలే వరకూ దీనిపై స్పష్టతకు ఆయా పార్టీలు కూడా రాలేవనే చెప్పాలి. కానీ, ఫలితాల తరువాత నంబర్ల సంగతి ఎలా ఉన్నా… భాజపా వ్యతిరేక పార్టీలను ఒక తాటి మీదికి తెచ్చేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నంగా దీన్ని చూడాలి.