మాజీ ఎంపీ గా కంటే, ఎన్నికల ఫలితాలను ఖచ్చితంగా ఊహించగల సెఫాలజీస్ట్ గా తెలుగు ప్రజల మీద గట్టి ముద్రవేసిన లగడపాటి ఈరోజు సాయంత్రం మీడియా సమావేశం పెట్టనున్నారు. అయితే ఎగ్జిట్ పోల్ ఫలితాలను కానీ , మరి ఏ రకమైన సర్వే రిపోర్టులను కానీ విడుదల చేయటానికి, ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం రేపు సాయంత్రం వరకు వీల్లేదు. దీంతో ఈ రోజు మీడియా ముందుకు రానున్న లగడపాటి ఏం చెబుతాడు అన్న ఆసక్తి అందరిలో నెలకొంది.
ఎప్పుడు ఎన్నికలైన తర్వాత మాత్రమే తన ఫలితాలను దాదాపు ఖచ్చితత్వంతో ప్రకటించే లగడపాటి, తెలంగాణ ఎన్నికల సమయంలో మాత్రం, ఎన్నికల కంటే ముందే ఫలితాలను ప్రకటించి, ఎన్నికలైన తర్వాత కూడా ముందు చెప్పిన ఫలితాలు పునరుద్ఘాటించి తీరా ఫలితాలు వచ్చాక తాను చెప్పిన నంబర్లకు అక్కడ వచ్చిన నంబర్లకు పొంతన లేకపోవడంతో బొక్క బోర్లా పడ్డారు. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు ఆ ఫలితాలపై వ్యాఖ్యలు కూడా చేయలేదు. అయితే మొన్నామధ్య అమెరికా వెళ్లిన సందర్భంలో, “అభివృద్ధి , సంక్షేమానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు పట్టం కట్టబోతున్నారు” అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన లగడపాటి , తెలంగాణ ఎన్నికల సమయంలో తన గురి ఎందుకు తప్పిందో కూడా మే 19వ తేదీన చెబుతా అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా పూర్తిస్థాయి అంచనాలను మే 19 వ తేదీన ప్రకటిస్తా అని కూడా ఆ రోజు వ్యాఖ్యానించాడు.
మరి ఈ నేపథ్యంలో, ఈరోజు సాయంత్రం పెట్టనున్న ప్రెస్ మీట్ లో ఏం చెబుతాడు అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. పూర్తిస్థాయి ఫలితాలను రేపు ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి, ఈరోజు తెలంగాణ ఎన్నికల సమయంలో తన అంచనా ఎందుకు ఫెయిల్ అయింది అన్న విషయం వివరించే అవకాశం ఉందని మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే ఎన్నికల ఫలితాలపై తన అంచనాలను పూర్తిస్థాయిలో రేపు ప్రకటిస్తా అని చెబుతూ ఈ సారి ఎంత పకడ్బందీగా తాను సర్వే నిర్వహించారు అని వివరించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.
మొత్తానికి, ఈ రోజు ప్రోగ్రాం కేవలం టీజర్ లాంటిదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.