టీవీ9 యాజమాన్య వివాదం కేసులో… అసలు తప్పు ఎవరు చేశారో…? ఎక్కడ చేశారో..? అందులో నిందితులెవరో…? … ఎవరికీ తెలియదు. అక్రమంగా అధికారం, డబ్బుల అండతో సంస్థలోకి చొరబడ్డారని.. రవిప్రకాష్ బృందం వాదిస్తోంది. దీనిపై కంపెనీ లా ట్రిబ్యునల్‌లో కేసు నడుస్తోంది. అది విచారణ వద్దని… కొత్త యాజమాన్యం స్టే తీసుకొచ్చిది. కానీ అదే కొత్త యాజమాన్యం.. తెలంగాణ పోలీసులతో.. రోజుకో రకమైన ప్రచారాన్ని రవిప్రకాష్, శివాజీలపై చేస్తున్నారు.
పోలీసులకు రవిప్రకాష్‌ను అరెస్ట్ చేసే ఉద్దేశమే లేదా..?
రవిప్రకాష్‌కు నోటీసులు జారీ చేసినప్పటి నుంచి.. అరెస్ట్ చేయబోతున్నాం.. అని పోలీసులు అదే పనిగా మీడియా ప్రతినిధులుకు చెబుతున్నారు. ఇప్పటికి దాదాపుగా వారం రోజులు అవుతుంది. రవిప్రకాష్.. మీడియాకు ఇంటర్యూలు ఇస్తున్నారు. ఆయన హైదరాబాద్‌లోనే ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు. ఫోన్లు స్విచ్చాఫ్ అని.. పోలీసులే చెప్పారు కానీ.. ఆయన తన సన్నిహితులకు తెలిసిన ఫోన్నెంబర్లో అందుబాటులో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. కానీ ఇంత వరకూ రవిప్రకాష్ కోసం గాలింపు ప్రారంభించినట్లుగా లేదు. నాలుగు బృందాలు ఏర్పాటు చేశామని.. మరొకటని మాటలు చెబుతున్నారు కానీ.. నిజంగా.. రవిప్రకాష్‌ను కానీ.. శివాజీని కానీ పట్టుకోవాలంటే.. అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే వారు అందరికీ తెలిసిన వ్యక్తులు. ఎక్కడున్నా.. తెలిసిపోతుంది.
రోజుకో రకమైన కేసు, వ్యతిరేక ప్రచారం చేస్తే సరిపోతుందా..?
ఓ రోజు సీక్రెట్స్ మెయిల్స్ అంటూ.. మీడియాకు కొన్ని లీకులు ఇచ్చారు. శివాజీ – రవిప్రకాష్ మధ్య జరిగిన ఒప్పందం.. అన్నారు.. మరో రోజు… టీవీ9 లోగోల అమ్మకం కేసన్నారు.. మరో రోజు.. లాయర్ ఇంట్లో సోదాలన్నారు… ఇలా రకరకాల ప్రచారాలను.. పోలీసులు చేస్తున్నారు కానీ.. అసలు… కేసేమిటో మాత్రం చెప్పలేకపోతున్నారు. శివాజీ-రవిప్రకాష్‌కు మధ్య జరిగిన ఒప్పందం… వ్యక్తిగతమని.. ఎవరికైనా తెలుస్తుంది. రవిప్రకాష్ షేర్లు శివాజీకి అమ్ముకున్నారు. మధ్యలో ఎవరో వచ్చి కేసు పెట్టడం ఏమిటి.. దాన్ని.. పోలీసులు గొప్ప క్రిమినల్ చర్యగా.. చెప్పుకోవడం ఏమిటనేది.. ఎవరికీ అంతుబట్టని అంశం. అలాగే.. రవిప్రకాష్ లోగోల అమ్మకం.. ఆ కంపెనీకి సంబంధించిన ఆయన సంపూర్ణ హక్కులతో అమ్మినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఒక వేళ కాకపోతే.. ఆ ఒప్పందం చెల్లదు. ఇందులో అరెస్ట్ చేయాల్సింత కేసు ఏముందో న్యాయనిపుణులకు కూడా అర్థం కావడం లేదు. ఇక కొత్త డైరక్టర్ల నియామకానికి అడ్డం పడటం.. ఫోర్జరీ కేసు గురించి పోలీసులు ఇప్పుడు ఏమీ మాట్లాడటం లేదు. అసలు ఫోర్జరీ చేశారో లేదో.. గుర్తించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసినట్లుగా పోలీసులు చెప్పడం లేదు. ఫోర్జరీ చేశారనేది కూడా… అలంద మీడియా ఫిర్యాదే కానీ… కంపెనీ సెక్రటరీ దేవేందర్ అగర్వాల్ ఫిర్యాదు ఇచ్చినట్లుగా కూడా ఎక్కడా లేదు.
కనిపిస్తే అరెస్ట్ అనే ప్రచారం రోజూ ఎందుకు..?
కొద్ది రోజుల కిందట.. డేటాచోరీ అనే కేసుతో… టీడీపీకి యాప్ సేవలు అందిస్తున్న సాఫ్ట్ వేర్ కంపెనీకి మరణశాసనం రాశారు పోలీసులు. అందులో అటు డేటా పోయిందన్నవారి ఫిర్యాదు లేదు. ఇటు కంప్లయింట్ చేసిన వారికీ.. ఎలాంటి సంబంధమూ లేదు. కానీ… ఓ రాజకీయ లక్ష్యంలో.. పోలీసులు భాగస్వాములై… ఆ కేసును చేపట్టారు. ఆ కేసు ఏమయిందో ఎవరికీ తెలియదు. ఆ కంపెనీ ఎండీ అశోక్‌ను పట్టుకోవడానికి దేశం మొత్తం గాలించామని… చెప్పుకొచ్చారు పోలీసులు. కానీ పట్టుకోలేకపోయారా..? లేక… ప్రయత్నమే చేయలేదా..?. అంటే.. రెండోదే నిజమని నమ్మాలి. ఎందుకంటే.. అసలు డేటా చోరీ అనే కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా లేవు. ఇప్పుడు రవిప్రకాష్ కేసులోనూ అంతే అన్నట్లుగా ఉన్నారు పోలీసులు. రోజూ.. ఏదో ఒకటి చెబుతూ ఉంటే సరిపోతుందని అనుకుంrటున్నట్లుగా కనిపిస్తోంది.