జి.హెచ్.ఎం.సి. ఎన్నికలను అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేసాయి. ఒకదానినొకటి చాల ఘాటుగా విమర్శించుకొన్నాయి. తమకే వంద సీట్లు వచ్చేస్తాయని లేకుంటే పదవులకు రాజీనామాలు చేసేస్తామని ఒకరంటే..వస్తే రాజకీయాలను, తెలంగాణా గడ్డని కూడా విడిచిపెట్టి వెళ్లిపోతామని మరొకరు భీకర శపధాలు చేసుకొన్నారు. ప్రజలను ఆకట్టుకోవడానికి ఏమేమి చేయాలో రాజకీయ పార్టీలు అన్నీ చేసాయి. కానీ ‘ఎగిరెగిరి దంచినా అంతే కూలి…రోటి కాడ పాడినా అంతే కూలి’ అన్నట్లుగా ఎండకన్నెరుగని రాజకీయనాయకులు కాళ్ళు అరిగిపోయేలా గ్రేటర్ మురికి గల్లీలలో తిరిగి ఎంతగా ప్రచారం చేసినా, ఎంత ప్రాయసపడినా ఓటర్లు మాత్రం ఆశించిన స్థాయిలో పోలింగ్ కేంద్రాలకు తరలిరాలేదు. కేవలం 45.25 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. కనీసం 50 శాతం పోలింగ్ కూడా నమోదు కాకపోవడం చూస్తే గ్రేటర్ ప్రజలకు ఈ ఎన్నికలపై ఎంతటి నిరాసక్తత కలిగి ఉన్నారో అర్ధం అవుతోంది.
అధికార తెరాస, ప్రతిపక్ష తెదేపా, బీజేపీ, మజ్లీస్, కాంగ్రెస్ పార్టీలకు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య వంటివి. అయినా గ్రేటర్ ప్రజలు వారి సమస్యలను, వాదనలను, విమర్శలను, వాగ్దానాలను పట్టించుకోలేదని స్పష్టమయింది. ఇంత తక్కువ శాతం పోలింగ్ నమోదు అవడం వలన అధికార పార్టీ ఆశించినన్ని సీట్లలో సగం కూడా వస్తాయో రావో అనుమానమే. మరొక రెండు రోజుల్లో ఎలాగు ఫలితాలు వెలువడబోతున్నాయి కనుక తినబోతూ గారెల రుచి ఎలాగ ఉంటుందో అని ఆత్రుత పడవలసిన అవసరం లేదు.