ఎగ్జిట్ పోల్స్‌తోనే భారతీయ జనతా పార్టీ నేతలు ముసుగు తీసేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను కబ్జా చేయడానికి తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. కర్ణాటకపై ఇప్పటికే ఆపరేషన్ కమల గురి పెట్టగా.. తాజాగాగా ఆ జాబితాలో మధ్యప్రదేశ్ చేరింది. బెంగాల్ సర్కార్ అంతు చూస్తామని మోడీ, కేరళ సర్కార్ అంతు చూస్తామని.. అమిత్ షా గతంలోనే హెచ్చరించారు. వాటిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభమయింది.
ఆపరేషన్ మధ్యప్రదేశ్ స్టార్ట్..!
మోదీ ప్రభుత్వం కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తే… రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను టార్గెట్ చేయడం ఖాయమైపోయింది. కర్ణాటకలో జేడీఎస్- కాంగ్రెస్ సంక్షీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు విఫలయత్నం చేసిన బీజేపీ.. తాజాగా మధ్యప్రదేశ్‌ను టార్గెట్ చేసింది. అక్కడ కాంగ్రెస్ బొటాబొటి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇద్దరు బీఎస్పీ, ఒక ఎస్పీ ఎమ్మెల్యేతో పాటు నలుగురు ఇండిపెండెంట్ల మద్దతుతో ప్రభుత్వాన్ని కొనసాగిస్తోంది. దాంతో ఎలాగైనా కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. వైరి పక్షాలకు చెందిన ఎమ్మెల్యేలను నయానో భయానో తమ పంచన చేర్చుకోవడం.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ .. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను ఐటీ దాడులతో భయపెడుతూ వస్తోంది. తమ పార్టీలో ఎమ్మెల్యేలను కలిపేసుకుంటూ రచ్చ చేస్తోంది.
బెంగాల్, కేరళలోనూ ప్రభుత్వాలను మారుస్తారట..!
మే 23 ఫలితాలు వెలువడిన తర్వాత పశ్చిమబెంగాల్ లో మమత సర్కారుకు మూడుతుందంటూ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఓపెన్‌గా ఇచ్చిన వార్నింగ్ సంచనలం సృష్టించింది. తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన 40-50 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నట్లు చెప్పి మోడీ బాంబు పేల్చారు. శబరిమల వివాదంలో కేరళ సర్కార్‌ను కూల్చేస్తామంటూ మరోపక్క బీజేపీ అధ్యక్షుడు స్టాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇదంతా ఎన్నికల ముందు సీన్. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వస్తామన్న అంచనాతో.. కార్యాచరణ ప్రారంభించారు. మధ్యప్రదేశ్‌తో మొదలుపెట్టి.. కర్ణాటక, పశ్చిమబెంగాల్ తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ రెడీ అవుతోంది.
కర్ణాటకలో ఇప్పటికే ఫైనల్ స్టేజ్ ఆపరేషన్..!
కర్ణాటకలోని జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ఇప్పటికే మరో మారు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 20 మంది ఎంపీలను గెలిపిస్తే.. జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేయగలమంటూ కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం కలకలం రేపుతోంది. 225 మంది ఎమ్మెల్యేలున్న కర్ణాటక అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 113. ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ బీజేపీ నేతలు చెబుతున్నారు. బీజేపీ మళ్లీ గెలిస్తే కర్ణాటక ప్రభుత్వం నిలబడటం కష్టమే.