నమో వేంకటేశాయ తరవాత సినిమాలవైపు దృష్టిసారించలేదు కె.రాఘవేంద్రరావు. అదే ఆయన చివరి చిత్రమని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే… తన ప్రయాణాన్ని ఫ్లాప్ సినిమాతో ముగించాలని అనుకోవట్లేదాయన. మరో హిట్ తీసి… దిగ్విజయంగా దర్శకుడిగా రిటైర్‌మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు. అందుకే కొన్ని కథల్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఎట్టకేలకు ఓ కథ ఖాయమైంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల కానుంది. అయితే ఈ సినిమాలో కొన్ని విచిత్రమైన కాంబినేషన్లు కనిపించే అవకాశం ఉందని సమాచారం. అదేమిటన్నది చిత్రబృందమే ప్రకటించాల్సివుంది. ఈ చిత్రాన్ని బాహుబలి నిర్మాతలు తెరకెక్కించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈనెల 23న రాఘవేంద్రరావు జన్మదినం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. ఆ విచిత్రమైన కాంబినేషన్ ఏమిటో తెలియాలంటే అప్పటి వరకూ ఆగాల్సిందే.