ఎగ్జిట్ పోల్స్ తీర్పు ఏకపక్షంగా వచ్చిన సంగతి తెలిసిందే. మరోసారి మోడీ సర్కారు ఢిల్లీలో కొలువుదీతుందని సర్వేలు ఢంకా బజాయించాయి. దీంతో ప్రతిపక్షాల్లో ఒక్కసారిగా కొంత నైరాశ్యం నెలకొంది. అయితే, ఎగ్జిట్ పోల్ అంచనాలపై వస్తున్న అనుమానాలు, సర్వేలు చేసిన మెథడాలజీపై ఇప్పుడు చర్చ జరుగుతూ ఉండటంతో… ప్రతిపక్ష క్యాంపులో కొంత ఉత్సాహం మళ్లీ పెరిగింది. ఎగ్జిట్ పోల్స్ బాకా ఊదినంతగా ఎన్డీయే కూటమికి మెజారిటీ రాదనే ఆశ మళ్లీ చిగురిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే, మద్దతు కూడగట్టే ప్రయత్నాలను మరోసారి ముమ్మరం చేస్తోంది. దీన్లో భాగంగా ఎన్డీయేతర పక్షాలను మచ్చిక చేసుకునే పనిని కాంగ్రెస్ పార్టీ మరోసారి ముమ్మరం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఎన్డీయేతో ఎలాంటి సంబంధం లేని రాజకీయ పార్టీలతో ఒక్కోటిగా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. దీన్లో భాగంగానే వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి మొన్ననే ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చినట్టు తెలుస్తోంది.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా జగన్ కి ఫోన్ చేసి సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలంటూ జగన్ ను కోరినట్టు సమాచారం. అయితే, ఈ వరుస ఫోన్లపై జగన్ ఇంకా తన అభిప్రాయాన్ని చెప్పలేదనీ, ఎన్నికల ఫలితాల తరువాతే స్పందిస్తానని వారితో చెప్పినట్టుగా కథనం. ఎగ్జిట్ పోల్స్ లో ఏపీలో వైకాపాకి పెద్ద సంఖ్యలో ఎంపీ స్థానాలు వస్తాయనే అభిప్రాయం వెల్లడైంది. దీంతో, ఆయన మద్దతు కోసం ప్రయత్నాలు ప్రారంభమైనట్టుగా చెప్పుకోవచ్చు.
అయితే, ఈ ఆహ్వానానికి జగన్ స్పందిస్తారా అనేదే ప్రశ్న? ఎందుకంటే, కేసీఆర్ తో కలిసి… కాంగ్రెసేతర, భాజపాయేతర ఫ్రెంట్ కి మద్దతుగా ఆయన ఉండే అవకాశాలున్నాయి. ఒకవేళ, ఎన్నికల ఫలితాల తరువాత హంగ్ పరిస్థితే వస్తే… ఫెడరల్ ఫ్రెంట్ అజెండాని తెర మీదికి తెద్దామని కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి, ఆయనకి మద్దతుగా నిలుస్తున్న జగన్ ఇప్పటికిప్పుడు మరొకరికి మద్దతుగా ఓకే అనలేని పరిస్థితి! ఇక్కడ ఇంకో గందరగోళ పరిస్థితీ ఉంది. అదేంటంటే… ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఎవరిస్తే వారికే మా మద్దతు అని జగన్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. దానికి కాంగ్రెస్ ఎలాగూ సిద్ధంగానే ఉంది. ఆ లెక్కన, కాంగ్రెస్ ఆహ్వానానికి జగన్ సానుకూలంగా స్పందించాలి కదా! ఎన్నికల ఫలితాల తరువాత పరిస్థితులను బట్టీ జగన్ స్పందించగలరని మాత్రమే అనిపిస్తోంది! ఈలోగా జాతీయ రాజకీయాలకు సంబంధించి ఎలాంటి స్పష్టమైన సంకేతాలు ఆయన ఇచ్చే పరిస్థితి లేదనే చెప్పాలి.