కాపునాడు అనంతర పరిణామాల విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అనేక రూపాల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. అయితే అంతగా ప్రచారంలోకి రాని విషయం వైఎస్సార్ పార్టీలోనూ కొన్ని భిన్న స్వరాలు వినిపించడం. కాపుల విషయంలో అధినేత జగన్కు సరైన వ్యూహం లేదని సీనియర్ నేతలు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. తమ నాయకులను అక్కడకు పంపించే ముందు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా..అని ప్రశ్నిస్తున్నారు.
సభను వ్యతిరేకించిన ప్రభుత్వానికి దాని బాధ్యత ఎత్తిచూపేటప్పుడు, హాజరైన మీకు బాధ్యత లేకుండాపోతుందా? అనే ప్రశ్నకు ఈ నేతలు తమ విధానపరమైన అస్పష్టతే కారణమని చెబుతున్నారు. కాపులు ఓటు మనకే ఓటు వేస్తారో తెలియనపుడు మిగిలిన బిసిలు, మొదటి నుంచి వెంటవున్న ఎస్సి, ఎస్టిలను దూరం చేసుకోకుండా జాగ్రత్తపడాలి కదా? అని ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఒకరు ప్రశ్నించారు. అసలు ఎప్పటికైనా ఇది సాధ్యమయ్యేట్టు లేదని రేపు మనకైనా ఈ స్థితి ఎదురుకాదా? అని ఆయన అడిగారు. రుణమాఫీ విషయంలో వాస్తవికంగా వుంటామని చెప్పిన మనం ఇప్పుడు కాపుల రిజర్వేషన్లపై లేనిపోని డిమాండ్లు చేసి చంద్రబాబులా ఇరకాటంలో పడిపోవడం ఎందుకుని కూడా ఆయన అడిగారు.
జరిగిన దానికి తమ నాయకుడిదే బాధ్యత అన్నట్టు చంద్రబాబు ఆరోపణలు గుప్పించడం తప్పయినప్పటికి దాన్ని తగు విధంగా ఖండించి తిప్పికొట్టడంతో ఆగక, జగన్ తనూ కొన్ని ఆరోపణలు చేసి చిక్కులు కొనితెచ్చుకున్నారనే భావం కూడా వుంది. ‘అసలు అంతసేపు మాట్టాడ్డం, ప్రతిసారీ అన్ని తవ్విపోయడం వల్ల విషయం పక్కదారి పడుతున్నది. ఈ విషయంలో బాబు చేసే పొరబాటే మావాడూ చేస్తున్నాడు’ అని ఆ సీనియర్ నాయకుడు నిట్టూర్పు విడిచారు.
ప్రభుత్వ నిర్వాకాల పలితంగా నిరసన పెరుగుతున్న తరుణంలో సరైన వ్యూహం చేపట్టి తగినంత ప్రయోజనం పొందలేకపోతున్నామనే భావం వైసీపీలో పెరుగుతున్నది. ఈ క్లిష్ట సమయంలో అందరితో చర్చించి అడుగేస్తే బావుంటుందని వారంతా భావిస్తున్నారు.