జగన్మోహన్ రెడ్డి… కౌంటింగ్ ట్రెండ్స్‌ను చూడటానికి అమరావతికి వస్తున్నారు. కనీసం ఫలితాలు అయినా సొంత రాష్ట్రంలో చూడకపోతే… ఇబ్బందులు వస్తాయని.. కొంత మంది సీనియర్లు చెప్పడంతో.. ఆయన ఈ మేరకు అమరావతికి రావడానికి అంగీకరించారని చెబుతున్నారు. గెలుస్తామన్న గట్టి నమ్మకం ఉండటంతో.. ఇప్పటికే…ఉండవల్లిలోని ఇంటి వద్ద పెద్ద ఎత్తున షామియానాల నిర్మాణం చేస్తున్నారు.
అభ్యర్థులకు కనీస జాగ్రత్తలు చెప్పలేకపోయిన జగన్..!
జగన్ మంగళవారం శాసనసభ, లోక్ సభ అభ్యర్దులతో కౌంటింగ్ వ్యూహాలపై చర్చించాల్సి ఉంది. పోలింగ్ ముగిసిన తర్వాత ఒక్క సారంటే.. ఒక్క సారి కూడా అభ్యర్థులతో జగన్ సమావేశం కాకపోవడంతో… కచ్చితంగా ఈ సమావేశం ఉంటుందనుకున్నారు. వైసీపీ అగ్రనేతలు కూడా అదే భావించారు. జగన్ కూడా సమావేశం పెట్టాలనే అనుకున్నారు. కానీ ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ వచ్చారు. చివరికి కౌంటింగ్‌కు ఒక రోజు ముందు పెడదామనుకున్నారు. అదీ కూడా వద్దనుకున్నారు. పదహారో తేదీన జగన్ లేకుండానే అభ్యర్దులు కౌంటింగ్ ఏజెంట్లతో పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఇందులో ఉదయం రెండు గంటలు, మధ్యాహ్నం రెండు గంటలు ప్రసంగాలు ఇచ్చారు. అదే శిక్షణా కార్యక్రమమని చెప్పి పంపేశారు.
అభ్యర్థులు ఎవరికీ కాని వాళ్లయిపోయారా..?
జగన్మోహనరెడ్డి పోలింగ్ అయిపోయిన తర్వాత అభ్యర్దులను కలిసేందుకు అంతగా ఆసక్తి చూపించలేదు. చాలా మంది లోటస్ పాండ్‌కు వెళ్లి నిరాశతో వెనక్కి వచ్చారు. మంగళవారం జరిగే సమావేశంలో జగన్ ను కలవవచ్చని… పీకే సర్వేలు… ఇతర అంశాలు చెబుతారని..వాళ్లు ఆశించారు. బుధవారం సాయంత్రం జగన్ విజయవాడ వచ్చినప్పటికీ.. వారెవరూ కలిసే అవకాశం లేదు. గురువారం ఉదయం కౌంటింగ్ కు అందరూ వెళ్లాల్సి ఉండటంతో అభ్యర్దులంతా హడావుడిలో ఉన్నారు. జగన్ పోలింగ్ రోజు కూడా పులివెందులలో ఓటు వేసి హైదరాబాద్ లోటస్ పాండ్ కు వెళ్లిపోయారు. అక్కడి నుంచే పోలింగ్ ను పర్యవేక్షించారు.
టీడీపీ సన్నద్ధతను అల్లర్లు చేయడానికేనని ఆరోపిస్తే సరిపోతుందా..?
వైసీపీ అగ్రనేతల తీరుతో… అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఓ వైపు తెలుగుదేశం పార్టీ… అన్ని రకాలుగా… శిక్షణ ఇచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ.. చిన్న పాటి నిర్లక్ష్యం కూడా చేయవద్దని స్పష్టం చేసింది. అంతకు మించి లాయర్లను… కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ… కౌంటింగ్ నిబంధనలపై అవగాహన కల్పించారు. కానీ .. వైసీపీలో అలాంటిదేమీ లేదు. ఎవరి కౌంటింగ్ భారం వారిదే అన్నట్లుగా వదిలేశారు. అయితే.. టీడీపీ నేతల కౌంటింగ్ అలర్ట్‌ను.. అల్లర్లు చేయడానికన్నట్లుగా ప్రచారం చేసి.. వైసీపీ నేతలు సంతృప్తి పడుతున్నారు. కానీ టెక్నికల్ అంశాలతో ఉన్న కౌంటింగ్ తేడా వస్తే.. మొత్తానికే మోసం వస్తుందని.. వారు అంచనా వేయలేకపోతున్నారు. అంతా దైవాధీనం సర్వీస్ అన్నట్లుగా వదిలేశారని.. వైసీపీ నేతలు.. బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు.