దేశంలో భాతీయ జనతా పార్టీ అనితర సాధ్యమైన విజయాన్ని నమోదు చేసింది. గత ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా సాధించిన సీట్ల కంటే.. మరో ఐదు సీట్లు ఎక్కువే సాధించే దిశగా పయనిస్తోంది. ఐదేళ్లో.. ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ.. ఓటింగ్ పై … ప్రజలు వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. సంచలనాత్మక విజయాన్ని బీజేపీకి అందించారు. బీజేపీ మిత్రపక్షాలు శివసేన, జేడీయూ కూడా మెరుగైన స్థానాల్లో విజయం సాధించాయి. తాను దేశానికి చౌకీదార్నని.. చెప్పుకున్న నరేంద్రమోదీ.. దేశానికి అలాగే కాపలా కాయమని అత్యధిక సీట్లు కట్టబెట్టారు. ఎన్డీఏ కూటమిలోని పార్టీలు తోక జాడించినా… ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా.. పూర్తి మెజార్టీని కట్టబెట్టారు.
హిందీ రాష్ట్రాల్లో బీజేపీ..గత ఎన్నికల ఫలితాలను రిపీట్ చేసింది. యూపీలో.. ఎస్పీ , బీఎస్పీ పొత్తు కారణంగా స్వల్పంగా సీట్లను కోల్పోయినప్పటికీ.. ఆ తేడాను.. ఇతర రాష్ట్రాల్లో భర్తీ చేసుకోవడమే కాదు..ఇంకా పెంచుకుంది. బెంగాల్లో.. ఏకంగా పదిహేనుకిపైగా సీట్లను సాధించింది. గత ఎన్నికల్లో ఇది ఒకటి మాత్రమే. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బీజేపీ సంచలన విజయాలను నమోదు చేసింది. కర్ణాటకలో ఉన్న ఇరవై ఎనిమిది సీట్లలో అత్యధికంగా… ఆ పార్టీ.. 20కిపైగా స్థానాలను గెలుచుకుంది. తెలంగాణలో ఐదు సీట్లలో ఆధిక్యంలో సాధించడం .. ఆ పార్టీ సాధించిన అద్భుత పురోగతికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
స్వతంత్ర భారత చరిత్రలో…. దేశానికి స్వాతంత్రం తెచ్చామని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా సాధించని స్థాయిలో ఇప్పుడు.. భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఒకే పార్టీ రెండో సారి దేశంలో… అత్యధిక సీట్లను… అదీ కూడా పూర్తి మెజార్టీని సాధించి..సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం పాలనపై.. నిర్ణయాలపై.. ఎంతో వ్యతిరేకత ఉన్నప్పటికీ… ప్రజలు మాత్రం.. ఈవీఎంలలో ఓట్లు గుద్దారు. మరో ఐదేళ్ల పాటు.. మోడీకి ఎదురు లేనట్లే.