జగన్ కు అవకాశం ఇవ్వాలన్న ఆరాటం.. చంద్రబాబు పాలనపై వ్యతిరేకత… ఓటింగ్లో స్పష్టమయింది. దాదాపుగా పది శాతం ఓట్లు.. రెండు పార్టీల మధ్య ఉండటం అసాధారణం. ఇంత భారీ ఆదరణ సాధించడానికి.. జగన్కు అనేక అంశాలు కలసి వచ్చాయి.
1. ప్రజలు ఒక్క చాన్స్ ఇవ్వాలనుకోవడం..!
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఒక్క చాన్స్ ఇవ్వాలనుకున్నారు. ఒక్క చాన్స్ అంటూ.. ఆయన బహిరంగసభల్లో చేసిన విజ్ఞప్తి ప్రజలను ఆకట్టుకుంది. ఒక సారి.. చంద్రబాబుకు చాన్సిచ్చాం. మరోసారి… జగన్ కు చాన్సివ్వాలని ప్రజలు ఆలోచించారు. ఆ సరళి ఓటింగ్ లో కనిపించింది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ… ప్రజలందరిలోనూ అదే ట్రెండ్ కనిపించింది.
2. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు..!
సంక్షేమంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిది .. ప్రత్యేకమైన సంతకం. ఆయన స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తానని.. జగన్ హామీలు ఇచ్చారు. ఓ భారీ మేనిఫెస్టోను కూడా ప్రకటించారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని… ప్రకటించారు. పిల్లలు స్కూళ్లకు వెళ్తే నగదు ఇస్తామన్నారు. వృద్దులకు మూడు వేల పెన్షన్ ఇస్తామన్నారు. ఇళ్లన్నీ ఉచితమేనని ప్రకటించారు. ఇంకా.. ఇలాంటి ఆర్థిక ప్రయోజనాలు… పెద్ద ఎత్తున ప్రజలకు కల్పిస్తామని చెప్పారు. ఇవన్నీ ప్రజల్లోకి వెళ్లాయి. విజయాన్ని సాధించి పెట్టాయి.
3. ప్రత్యేకహోదాపై పోరాటం..!
ప్రత్యేకహోదా పేరుతో జగన్మోహన్ రెడ్డి.. అవిశ్రాంతంగా పోరాడారు. పార్లమంట్ సభ్యులతో పదవీ త్యాగం కూడా చేయించారు. ఆ ఫలితం.. ఫలితాల్లో కనిపించింది. పార్లమెంట్ సభ్యులు కూడా ఏకపక్షంగా గెలవడమే దీనికి సంకేతం.
4. ప్రజల్లో తరగని వైఎస్ పై ఆదరణ..!
వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై… ప్రజల్లో ఉన్న తరగని ఆదరణ.. జగన్మోహన్ రెడ్డికి కలసి వచ్చింది. ఆయన పథకాలను గుర్తు చేయడానికి యాత్ర లాంటి సినిమాలు విడుదల కావడం కూడా.. ఉపయోగపడింది. చంద్రబాబు.. పెద్ద పెద్ద మేధావుల పేరుతో.. ఎవరెవరితో ప్రశంసలు పొందుతారు కానీ… జగన్ మాత్రం.. మాస్లో .. ఆదరణ ఉన్న చిన్న చిన్న సినీతారలతోనే ప్రచారం చేయించుకున్నారు. అనుకున్నట్లుగా విడయం సాధించారు.
5. తెలుగుదేశం పార్టీపై వ్యతిరేకత..!
తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఈ ఫలితాల్లో వ్యక్తమయింది. ఆ విషయాన్ని… టీడీపీ నేతలు గుర్తించలేకపోయారు. కానీ.. వైసీపీ నేతలు మాత్రం గుర్తించారు. దానికి తగ్గట్లుగా… రాజకీయ వ్యూహాలను అమలు చేశారు. అనితర సాధ్యమైన విజయాన్ని నమోదు చేశారు.