తెలంగాణలో భవిష్యత్తు మాదే… ఇదే ధీమాను వ్యక్తం చేశారు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్. రాష్ట్రంలో సార్ కారుకి పంక్చర్ అయిందనీ, పదహారు సంఖ్య గల్లంతయిందన్నారు. తెరాస పెత్తందారీ ప్రభుత్వానికి అసలు సిసలైన ప్రత్యామ్నాయం భాజపా అని ప్రజలు విశ్వసించారన్నారు. ముఖ్యమంత్రి కుమార్తెను సైతం ఓడించే స్థాయికి తెలంగాణలో భాజపా ఎదిగిందన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకి వచ్చి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా పాలించాలన్నారు. భాజపా ప్రజలకు అండగా ఉండి పోరాటం చేస్తుందన్నారు. నాలుగు నెలల కిందట కేసీఆర్ కి బ్రహ్మరథం పట్టిన ప్రజలే, ఇప్పుడు భాజపాకి ఓటేశారంటే… తెరాస పాలన ఎంత అహంకారపూరితంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు లక్ష్మణ్. మొత్తానికి, తెలంగాణలో తమకు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించగలిగే వాయిస్ వచ్చిందన్నట్టుగా ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఒక్కటంటే ఒక్క సీటు మాత్రమే భాజపాకి వచ్చింది. దాంతో, రాష్ట్రంలో ఈ పార్టీకి ఇక స్థానం లేదనే విమర్శలూ అంచనాలూ చాలా వచ్చాయి. అయితే, లోక్ సభ ఎన్నికలకు వచ్చేసరికి నాలుగు చోట్ల భాజపా ఎంపీలు గెలిచారు. సంఖ్యాపరంగా చూసుకుంటే ఇదేమీ పెద్ద నంబర్ కాదుగానీ, తెలంగాణ భవిష్యత్తు రాజకీయాల్లో భాజపా బలపడ్డానికి పడిన పునాదిగా ఈ ఫలితాన్ని చూడొచ్చు. తెలంగాణలో ఈ ఎంపీల గెలుపుతో… భాజపా తరువాతి లక్ష్యం ఈ రాష్ట్రమే అన్నట్టుగా కనిపిస్తోంది. నిజానికి, అసెంబ్లీ ఎన్నికలకు ముందే.. భాజపాను విస్తరింపజేయాలనుకునే రాష్ట్రాల జాబితాలో కూడా తెలంగాణ ఉంది. అయితే, ఆ తరువాత కొన్నాళ్లపాటు మోడీ పాలనకు కాస్త అనుకూలంగా తెరాస వ్యవహార శైలిలో కొంత మార్పు కొన్నాళ్లు కనిపించింది. ఆ తరువాత, కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో భాజపాకి అధికారం దక్కకపోవడం, మరో మూడు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు రావడం… ఇలా వరుస పరిణామాల నేపథ్యంలో భాజపా లక్ష్యం కొంత పక్కకు వెళ్లినట్టయింది.
ఇప్పుడు, రాష్ట్రంలో నాలుగు ఎంపీ సీట్లు, కేంద్రంలో మరోసారి అధికారం… భాజపా విస్తరణకు సానుకూలంగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు, రాష్ట్రంలో తెరాసకు ప్రధాన ప్రతిపక్షంగా ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీ కూడా కొంత బలహీనంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ముగ్గురు బలమైన అభ్యర్థులు ఎంపీలుగా గెలిచినా… కేంద్రంలో అధికార బలమున్న భాజపాకే రాజకీయంగా కొంత అడ్వాంటేజ్ ఉండే అవకాశాలే సహజంగా ఉంటాయి. మొత్తానికి, తెలంగాణలో భాజపా విస్తరణకు ఇది పునాదిగానే కనిపిస్తోంది. మున్ముందు ఎలాంటి పరిణామాలుంటాయో చూడాలి.