గతంలో ఎంపీల పాత్ర పరిమితంగా ఉండేది. కానీ.. గత ఐదేళ్ల కాలంలో.. మాత్రం.. లోక్సభ సభ్యుల పని ముళ్ల మీద ఉన్నట్లే అయింది. రాష్ట్రం కోసం.. కేంద్రంలో భాగంగా ఉండి పోరాటం చేయాల్సిన పరిస్థితి.. అలాగే… కేంద్రం నుంచి బయటకు వచ్చీ.. పోరాడాల్సిన రాజకీయం. అలా.. రెండు కోణాల్లోనూ ఎంపీలు తీవ్రంగా కష్టపడ్డారు. కానీ ప్రజాభిమానం మాత్రం పొందలేకపోయారు.
ప్రత్యేకహోదా పోరాటంలో పస లేదని తేల్చిన ప్రజలు..!
ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తానని తిరుమల తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని మోదీ హామీ ఇచ్చి ఆ తర్వాత విస్మరించారు. విభజన చట్టంలోని హామీల్ని అమలు చేయలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు టీడీపీ ఎంపీలు. విభజన చట్టం హామీల్ని అమలుచేయాలని, ప్రత్యేకహోదా హామీ నిలబెట్టుకోవాలని ప్రధానిపై ఒత్తిడి పెంచారు. చివరికి మొండి చేయి చూపారు. 2018 బడ్జెట్ సమావేశాల సమయంలోనూ, ఆ తర్వాత వర్షాకాల, శీతాకాల సమావేశాల్లో, 2019 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల్లోనూ…, తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంట్ ఉభయసభలను స్తంభింపచేశారు. అటు లోక్సభ, ఇటు రాజ్యసభలో ప్రతిరోజూ ఆందోళనలు కొనసాగించారు. సమావేశాల్లో ప్లకార్డులు పుచ్చుకుని నిరసనలు తెలిపారు. సస్పెండ్ చేస్తే పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం దగ్గర ఆందోళనల్ని కొనసాగించారు.
టీడీపీ పోరాటం ఫలితాన్నివ్వలేదని ఆగ్రహించిన జనం..!
పలు పార్టీల మద్దతు తీసుకుని …ఆందోళనల్ని కొనసాగిస్తూ వచ్చారు. దీంతో ఎంపీల ఆందోళనలు, దీక్షలు, ధర్నాలకు పలు పార్టీల నేతలు మద్దతు తెలిపారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని, విజభన చట్టం అంశాల్ని అమలుచేయాలని జాతీయ పార్టీ కాంగ్రెస్తో సహా పలు ప్రాంతీయ పార్టీలు పార్లమెంట్లో డిమాండ్ చేశాయి. విభజన చట్టం అంశాలు అమలు చేయాలని, ప్రత్యేకహోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ధర్మపోరాట దీక్షలు చేశారు. లోక్సభలో గల్లా జయదేవ్ , కింజారపు రామ్మోహన్నాయుడు.. కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇద్దరు ఎంపీలు…ప్రధాని మోదీ వైఖరిని తూర్పారబట్టారు. దీంతో లోక్సభ సభ్యులు నివ్వెరపోయారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని గద్గదస్వరం…ముక్తకంఠంతో ప్రశ్నించేసరికి జాతి యావత్తూ కేంద్రం ఏకపక్ష ధోరణిని గమనించింది.
అతి కష్టం మీద బయటపడిన గల్లా, రామ్మోహన్..!
ఈ స్థాయిలో టీడీపీ ఎంపీలు పోరాడేసరికి …సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు ఖాయమని అంతా భావించారు. టీడీపీ శ్రేణులు, అభిమానులు మాత్రమే కాదు.., ఏపీకి న్యాయం జరగాలి, రాష్ట్ర అభివృద్ధి చెందాలి అనుకునేవారంతా బీజేపీకి వ్యతిరేకంగా గొంతెత్తేసరికి ….పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయం నల్లేరుపై నడకే అనుకున్నారు. కానీ ఫలితం చూస్తే సీన్ రివర్స్ అయ్యింది. వైసీపీ ఏకపక్షంగా విజయఢంకా మోగించింది. గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని మాత్రమే.. అతి కష్టం మీద… బయటపడ్డారు. మిగతా ఎంపీలు లక్షల తేడాతో ఘోరపరాజయం పాలయ్యారు. నాలుగేళ్లు కేంద్రమంత్రిగా ఉన్న అశోక్ గజపతిరాజు కూడా… ఓడిపోయారు.