కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ … ఉత్తరప్రదేశ్లోని అమేథీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రాహుల్పై స్మృతి ఇరానీ.. విజయం సాధించారు. నిజానికి 2014 ఎన్నికల్లోనే రాహుల్పై స్మృతీ ఇరానీ పోటీ చేశారు. లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పుడే అమేథీలో అసలు పని ఇప్పుడే మొదలైందని స్మృతి ఇరానీ ప్రకటించారు. దానికి తగ్గట్లుగానే అమేథీపై దృష్టి పెట్టారు. రాజ్యసభ సభ్యురాలిగా తనకు వచ్చే నియోజకవర్గ అభివృద్ధి నిధులను ఆమె అమేథీ ప్రజల కోసం వెచ్చించారు. గుజరాత్ నుంచి కూడా పెద్ద ఎత్తున నిధుల ప్రవాహం.. అమేథీ నియోజకవర్గానికి సాగింది.
2014 నుంచి అమేథీ ప్రజల కోసం అన్ని రకాలుగా కష్టపడ్డారు. ప్రధాని మేదీని రప్పించి అనేక సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఇంతకాలం గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న నియోజకవర్గమైనప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదని ఆమె గుర్తించారు. అంతే అక్కడ ప్రత్యేక దృష్టి పెడుతూ యువతకు ఉపాధి కల్పించే పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు లోపించాయని గ్రహించిన స్మృతీ ఇరానీ అక్కడ రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరిగే చర్యలు చేపట్టారు. వారిని నైపుణ్య శిక్షణ ఇప్పించారు. బీజేపీ తమ కోసం పనిచేస్తోందన్న ఆలోచన అమేథీ ప్రజల్లో కల్పించారు. ప్రతీ మూడు నెలలకు ఒక సారి అమేఠీలో గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ చిన్న చిన్న సభలు నిర్వహించారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే ప్రయత్నం చేశారు. ప్రతి దీపావళికి గ్రామీణ పేద మహిళలకు బట్టలు పంపించారు.
హిందూత్వ విషయంలో కూడా స్మృతీ ఇరానీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కొన్ని సంస్థల సీఎస్సార్ నిధులతో పది వేల గోవులను కొనుగోలు చేసి గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేశారు. ఇది అటు గో సంరక్షణకు, ఇటు గ్రామీణ ఉఫాదిని పెంచేందుకు ఆమె ప్రయత్నం దోహదపడింది. ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్లో కొంత మంది సీనియర్ సిటిజన్స్ ను ఎంపిక చేసి వారిని హరిద్వార్, రిషికేష్ తీర్థయాత్రకు పంపారు. ప్రయాగ్రాజ్లో కుంభమేళా జరిగినప్పుడు కూడా స్మృతీ ఇరానీ అమేథీ ప్రజలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇరవై వేల మంది యాత్రికులను కుంభమేళాకు తీసుకెళ్లి అక్కడ పుణ్యస్నానాలు, దర్శనాలు చేయించారు. ఓడిపోయినా అమేథీ నియోజకవర్గాన్ని స్మృతీ ఇరానీ తన సొంత ఇల్లుగా భావించారు. ప్రజలకు చేరువగా, ప్రజల్లో ఉండేందుకు అన్నీ చర్యలు తీసుకున్నారు. మరో పక్క కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అందుకు భిన్నంగా వ్యవహరించారు. అమేథీ కోసం ఆయన ఎక్కువ సమయం కేటాయించలేదు. దాంతో ఆయన గెలిచినా తమకు ఏమీ ఉపయోగం ఉండదని… స్మృతి ఇరానీ అయితే.. ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందని..ఓటర్లు నిర్ణయానికి వచ్చారు.