దక్షిణాదిలో బీజేపీకి ఈ సారి ప్రొత్సహకర ఫలితాలే వచ్చాయి. ముఖ్యంగా కర్ణాటకలో దాదాపుగా క్లీన్ స్వీప్ చేశారు. తెలంగాణలో అనూహ్యంగా నాలుగు లోక్‌సభ సీట్లు గెలుచుకున్నారు. అయితే… ఏపీ, కేరళ, తమిళనాడుల్లో మాత్రం.. బీజేపీకి ఒక్కటి కూడా రాలేదు. గతంలో ఉన్న సీట్లు కూడా పోయాయి. ఏపీ, కేరళ,తమిళనాడు మినహా దాదాపు అన్ని రాష్ట్రాల్లో బీజేపీ సత్తా చాటింది. ఉత్తరాదిన అయితే.. బీజేపీ మినహా మరో పార్టీ లేదన్నంత విజయం నమోదు చేసింది. శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన ప్రాంతాల్లోనూ బీజేపీ సత్తా చాటింది. మరి దక్షిణాదిన ఉన్న మూడు రాష్ట్రాల్లోనూ గెలవలేదు.
తమిళనాడు ప్రజల సెంటిమెంట్‌తో ఆడుకున్న బీజేపీ..! వెలేసిన ప్రజలు..!
జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేను బీజేపీ తమ చెప్పు చేతల్లోకి తీసుకుంది. తమిళ ప్రజల సెంటిమెంట్లతో ఆడుకుంది. అదే సమయంలో… స్టాలిన్ బలమైన నాయకుడిగా ఉండటంతో… డీఎంకే బలపడింది. లోక్ సభ ఎన్నికల్లోనూ అదే తేలింది. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ వ్యూహాత్మకంగా ముందుకెళ్లారు. తన పార్టీకి విజయావకాశాలు పెరగాలంటే, అత్యధిక లోక్ సభ స్థానాలు గెలవాలంటే ఎవరితో పొత్తు పెట్టుకుంటే ప్రయోజనం కలుగుతుందో అంచనా వేసుకున్నారు. ఆ దిశగా పావులు కదిపారు. పొత్తుల విషయంలో కాంగ్రెస్ చేయి పట్టుకునేందుకే స్టాలిన్ మొగ్గుచూపారు. గతంలో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్నప్పుడు శాసనసభ ఎన్నికల్లో ప్రయోజనం పొందలేకపోయినా ఈ సారి కూడా ఆయన ఆ పార్టీ వైపే నడిచారు. కొన్ని చిన్న పార్టీలను కూడా కలుపుకున్నారు. దానితో డీఎంకేకు ఊహించిన దాని కంటే ఎక్కువ ప్రయోజనం కలిగింది. ఒక్కటి మినహా అన్ని సీట్లలోనూ విజయం సాధించారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ మద్దతుగా మనుగడ సాగిస్తున్న ఆన్నాడీఎంకే త్వరలో కేడర్ తగ్గిపోయి పూర్తిగా బలహీనపడే అవకాశం ఉంది.
కేరళలో ఉన్న ఒక్క స్థానాన్నీ ఊడగొట్టిన జనం..!
హిందూత్వ ఎజెండాతో.. కేరళలో… శబరిమలను ఇష్యూ చేసి… అక్కడ పాగా వేద్దామనుకున్నారు బీజేపీ నేతలు. శబరిమల తీర్పు ద్వారా ఏదో లబ్ధి పొందాలని బీజేపీ భావించినా ఆ పాచిక పారలేదు. కానీ వారి ప్రయత్నాలను కేరళ జనం తిప్పికొట్టారు. కేరళలో ఇంతకాలం యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మధ్య నువ్వా- నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వయనాడ్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగినప్పటి నుంచి కేరళ రాజకీయం మారిపోయింది. తమ రాష్ట్రం నుంచి పోటీ చేసే వీఐపీకి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలున్నాయని కేరళ జనం నమ్మారు. కేరళలో ముందెన్నడూ లేని విధంగా కాంగ్రెస్‌కు లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కేరళ ప్రజల సమస్యలు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే తెలుసని కూడా అక్కడి ప్రజలు విశ్వసించారు. కాంగ్రెస్ కూటమే… దాదాపుగా అన్ని సీట్లనూ గెలుచుకుంది. ఇంతకాలం తమతో ఉన్న కాంగ్రెస్, ఎల్డీఎఫ్ మధ్యే పోటీ ఉండాలని వారు ఆకాంక్షించారు. దేశంలో కమ్యూనిస్టుల బలం తగ్గిపోతున్న తరుణంలో కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని జనం నిర్ణయించారు. అందుకే లోక్ సభ ఎన్నికల వరకు కేరళలో ఫలితం ఏకపక్షమైంది. బీజేపీకి షాకిచ్చింది.
ఏపీలో నోటాకు వచ్చిన దాంట్లో సగమే..!
గత ఎన్నికల్లో బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని రెండు పార్లమెంట్ స్థానాలు, నాలుగు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. కానీ హామీలు అమలు చేయకుండా… మొహం చాటేశారు. దాంతో ఆ ఆగ్రహం అంతా ప్రజలు.. బీజేపీపై చూపించారు. ఫలితంగా.. ఒక్క శాతం ఓట్లు కూడా .. అసెంబ్లీ పార్లమెంట్లో బీజేపీకి రాలేదు. అగ్రనేతలు అనబడే… కన్నా, పురందేశ్వరి లాంటి వాళ్లు కూడా పరాజయం పాలయ్యారు. దాంతో పరువు పోగొట్టుకున్నట్లయింది.