విజయ్ దేవరకొండ కోసం కథలు సిద్ధం చేస్తున్న దర్శకుల జాబితా చాంతాడంత ఉంది. ప్రస్తుతం ఆ జాబితాలో హను రాఘవపూడి కూడా చేరిపోయినట్టు సమాచారం. `పడి పడి లేచె మనసు` ఫ్లాప్‌తో డీలా పడ్డాడు హను. అయితే తనని నమ్మి డబ్బులు పెట్టే నిర్మాతలు ఇంకా ఉన్నారు. వైజయంతీ అనుబంధం సంస్థ స్వప్న సినిమాస్‌తో విజయ్ ఓ సినిమా చేయాలి. ఇప్పటి వరకూ స్వప్న సినిమాస్‌లో రెండు సినిమాలు చేశాడు విజయ్. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఒప్పందం ప్రకారం మూడో సినిమా పూర్తి చేయాల్సివుంది. ఆ సినిమాని హనుతో చేయాలని స్వప్న దత్ భావిస్తోంది. విజయ్ దేవరకొండకు సరిపడ ఓ కథని తయారు చేయమని హనుకి చెప్పిందట స్వప్న దత్. హను కూడా ఓ లవ్ స్టోరీని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మిలటరీ నేపథ్యంలో సాగే ఈ లవ్ స్టోరీలో విజయ్ అయితే బాగుంటాడని హను కూడా భావిస్తున్నాడట. విజయ్ ఓకే అంటే… ఈ సినిమా ఫిక్స్ అయిపోయినట్టే. మరి ఏం జరుగుతుందో చూడాలి.