తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు కావాల్సిన పరిస్థితిని భాజపా సృష్టించుకుంటుందనే వాతావరణమే కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటుకు పరిమితమైన భాజపా, ఇప్పుడు నాలుగు ఎంపీ స్థానాలను దక్కించుకుంది. దీంతో, తెరాసకు తామే ప్రత్యామ్నాయం అనే ప్రచారాన్ని రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మొదలుపెట్టేసిన పరిస్థితి. కేంద్రమంత్రి వర్గంలో తెలంగాణకు ప్రాధాన్యత దక్కుతుందనే చర్చ ఇప్పుడు వినిపిస్తోంది. గెలిచిన నలుగురిలో… ఇద్దరి పేర్లు ప్రముఖంగా పరిశీలనకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. సికింద్రాబాద్ ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీగా గెలిచిన అరవింద్… ఈ ఇద్దరిలో ఒకరికి మోడీ కేబినెట్ లో చోటు దక్కుతుందనే అంచనాలు మొదలయ్యాయి.
నిజానికి, ఈ ఇద్దరికీ రెండు రకాల సానుకూలతలు కనిపిస్తున్నాయి. కిషన్ రెడ్డి దశాబ్దాలుగా భాజపాని నమ్ముకుని ఉన్నారు. ఓరకంగా, తెలుగు రాష్ట్రాల్లో భాజపా నాయకులు అనగానే… మొదటి వరుసలో గుర్తొచ్చేది బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డిలు. దత్తాత్రేయకి గత కేబినెట్ లో మంత్రి పదవి దక్కింది. ఆ తరువాత, వయోభారంతో సమర్థంగా పనిచేయలేకపోతున్నారన్న కారణం చూపించి, పదవి నుంచి తప్పించారు. దీంతో తెలంగాణ భాజపా వర్గాల్లో కొంత అసంతృప్తి కూడా వ్యక్తమైంది. అంతేకాదు, తాజా ఎన్నికల్లో ఆయనకి సీటు ఇవ్వలేదు. అయినాసరే, ఎలాంటి అసంతృప్తికీ లోను కాకుండా కిషన్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ఇచ్చారాయన. చాన్నాళ్లుగా పార్టీకి సేవలు చేస్తున్న కిషన్ రెడ్డికి కేంద్ర కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉందని ఆయన అభిమాన వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇక, నిజామాబాద్ ఎంపీ అరవింద్ విషయానికొస్తే… ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె మీద ఆయన గెలిచారు. పార్టీపరంగా చూసుకుంటే… తెరాస మీద భాజపా ఆధిక్యం ప్రదర్శించిన గెలుపుగా దీన్ని చూడొచ్చు. రాష్ట్రంలో భాజపాని మరింత పటిష్టం చేసుకోవాలంటే… ఇప్పుడు గెలుచుకున్న ఈ నిజామాబాద్ ఎంపీ స్థానాన్ని పార్టీకి కంచుకోటగా మార్చుకోవాలి. పైగా, ఎంపీ కవిత మీద అరవింద్ గెలుపుపై జాతీయ స్థాయిలో కూడా అందరూ ఆసక్తిగా చూసిన పరిస్థితి ఉంది. కాబట్టి, అరవింద్ కు మంత్రి పదవి ఇస్తారనీ, తద్వారా రాష్ట్రంలో భాజపా విస్తరణకు సానుకూల పరిస్థితులు ఏర్పడతాయనేది ఆయన అభిమాన గణం నుంచి వినిపిస్తున్న ఆశాభావం. ఈ ఇద్దరిలో ఎవరికి అవకాశం ఉంటుందో తేలాలంటే వేచి చూడాల్సిందే. ఏదేమైనా, తెలంగాణలో భాజపాకి నయా జోష్ వస్తున్న ఆశాభావం వ్యక్తమౌతోంది.