వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ… అధినేత జగన్… పేద, మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకునేలా… నవరత్నాలను ప్రకటించారు.వాటితో పాటు ఎన్నో హామీలను కూడా.. తన రెండు పేజీల మేనిఫెస్టోలో ప్రకటించారు. వాటన్నింటినీ ఇప్పుడు అమలు చేయడమే అసలు లక్ష్యం.
జగన్ తొలి సంతకం ” వైఎస్ఆర్ రైతు భరోసా”పై పెట్టాలి..!
వైఎస్ జగన్మోహన్ రెడ్డి .. వైసీపీ మేనిఫెస్టో ప్రకటనలో..నవరత్నాల్లో ఒకటిగా.. రైతు భరోసా కింద… ఏటా మే నెలలో రూ. 12, 500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇది మే నేలే. మేనెలలోనే ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి… తన నవరత్నాల్లో మొదటి హామీని.. మొట్టమొదటగా… అమలు చేసే అవకాశం చిక్కింది. ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకం పేరుతో.. రాష్ట్రం పథకాన్ని అమలు చేస్తోంది. రెండు విడతలుగా మొత్తం పదిహేను వేల రూపాయలు రైతుల ఖాల్లో జమ అవుతుంది. తొలి విడతగా జమ చేశారు కూడా. ఈ పదిహేను వేలల్లో ఆరువేలు కేంద్రం.. మరో తొమ్మిది వేలు రాష్ట్రం ఇస్తాయి. కేంద్ర పథకానికి అర్హులు కాని వారందరికి ఏపీ ప్రభుత్వమే ఇస్తోంది. ఇది ఆగిపోయినట్లే. అందుకే.. జగన్.. మళ్లీ వచ్చే ఏడాది మే వరకూ కాకుండా.. ఇప్పుడే రైతులకు తొలి విడత రైతు భరోసా ఇవ్వాల్సి ఉంది.
వృద్ధులకు రూ. 3వేల పెన్షన్‌పై మొదటి సంతకం చేస్తారా..?
గతంలో నవరత్నాల్లో భాగంగా… రెండు వేల రూపాయుల చేస్తామని ప్రకటించారు. కానీ టీడీపీ ప్రభుత్వం దాన్ని అమలు చేసేసింది. దాంతో.. కొత్తగా మూడు వేలు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. గెలిచిన వెంటనే.. పెన్షన్ మూడు వేలు ఇస్తామని చెప్పారు. మూడు వేల రూపాయలు అనే మాటను… ప్రజల్లోకి తీసుకెళ్లారు. వృద్ధులు పెద్ద ఎత్తున జగన్‌కు ఓట్లు వేశారు. పెన్షన్ల వయసును.. రెండు పార్టీలు.. అరవై ఐదు నుంచి అరవైకి తగ్గిస్తామని ప్రకటించారు. అలాగే్.. 45 ఏళ్లకే… ఎస్సీ, ఎస్టీ, బీసీలకు.. పెన్షన్ ఇస్తామని చెప్పారు. వాటిని కూడా అమలు చేయాల్సి ఉంది. 45 ఏళ్లు నిండిన ప్రతీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు మొదటి ఏడాది తర్వాత రూ.75వేలు ఇస్తామని చెప్పారు. కిడ్నీ సహా ధీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10వేలు పింఛన్ కూడా హామీ ఇచ్చారు.
డ్వాక్రా మహిళల రుణమాఫీ..!
డ్వాక్రా రుణాల మాఫీ చేస్తామని జగన్ ప్రకటించారు. యాభై వేల వరకూ రుణం మాఫీ చేస్తారని.. డ్వాక్రా మహిళలు ెదురు చూస్తున్నారు. ఒక్కొక్కరికి యాభై వేలు రుణమాఫీ చేస్తే ఏడాదికి… యాభై వేల కోట్లు కావాల్సి ఉంటుంది. నాలుగు విడతలుగా ఇస్తామంటున్నారు. అంటే.. ఏడాదికి రూ. 12500 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అమలులోకి తీసుకు వచ్చిన నిరుద్యోగభృతి ఉంటుందో ఉండదో చెప్పలేదు.
ప్రతీ పిల్లవాడి ఫీజు కట్టాలి..!
ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకంలో భాగంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో.. ఎవరు ఎంత చదువుకున్నా… చదువు ఫ్రీ. అది ఇంజినీరింగ్ అయినా.. డాక్టర్ అయినా సరే. అలాగే.. ఖర్చులకు.. ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని కూడా చెప్పారు. ఇక స్కూలుకు వెళ్లే పిల్లలకు… ఒక్కో కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటే.. అంత మందికి.. నెలకు రూ. పదిహేను వేల చొప్పున ఇస్తామని చెప్పారు. వీటి కోసం జగన్ ఎదురు చూస్తున్నారు.
మద్యనిషేధమే అసలు సవాల్..!
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అత్యంత ప్రాధాన్యమైన హామీల్లో ఒకటి.. నవరత్నాల్లో మేలిమి రత్నం.. మద్యనిషేధం. దశలవారీగా.. అమలు చేస్తామని జగన్ చెప్పారు. మొదటగా… స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం దొరికేలా చేసి.. చివరికి… అంటే.. వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా మద్యనిషేధం విధించి… ఎన్నికలకు వస్తామని ప్రకటించారు. ఇవే కాదు.. అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బుల చెల్లింపు దగ్గర్నుంచి తిత్లీ తుపాను బాధితులకు రూ. మూడు వేల కోట్ల నష్టపరిహారం చెల్లిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటలన్నింటినీ జగన్ నెరవేర్చాల్సి ఉంది. లేకపోతే.. ఆయన చెప్పిన రాజకీయ వ్యవస్థ మారే అవకాశం లేదు.