నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె కవిత ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మిగతాచోట్ల తెరాస ఓటమి ఒక లెక్క అయితే, కవిత ఓటమి భారం తెరాసకి మరో లెక్క! కవిత ఓటమిపై జాతీయ మీడియాలో కూడా బాగానే చర్చ జరిగింది. అయితే, ఇప్పుడు కవిత రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది తెరాస వర్గాల్లో చర్చనీయం అవుతోంది. పోయినచోటే వెతుక్కోవడం… అంటే, ఓడిన నిజామాబాద్ లోనే గెలిచి సత్తా చాటుకోవాలంటే, మరో ఐదేళ్లపాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఒకవేళ అదే పట్టుదలతో కవిత ఉంటే… ఈ ఐదేళ్లూ ఏం చేస్తారనేది ప్రశ్న? ఎలాంటి పదవీ లేకుండా, కేవలం ముఖ్యమంత్రి కుమార్తెగా మాత్రమే ఉంటే… తెరాస నాయకురాలిగా ఆమె ప్రభావవంతంగా వ్యవహరించగలరా అనేదీ ప్రశ్నే..?
రాష్ట్ర కేబినెట్ లో కవితకు స్థానం కల్పించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఆమెకి మంత్రి పదవి అనే చర్చను తెరాస ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ తెర మీదికి తెచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన కవిత ఖాళీగా ఉండరనీ, రాష్ట్రమంత్రిగా ప్రజలకు సేవ చేస్తారంటూ ఆయన మొన్ననే వ్యాఖ్యానించారు. ఎలాగూ రాష్ట్ర కేబినెట్ విస్తరణ చేయాల్సి ఉంది. కీలక శాఖలకు మంత్రులు లేని పరిస్థితి ఉంది. లోక్ సభ ఎన్నికలైతే తప్ప… రాష్ట్ర కేబినెట్ విస్తరణపై కేసీఆర్ ఏ నిర్ణయమూ తీసుకోరని అనుకున్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలూ వచ్చేశాయి, జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రెంట్ చర్చే ఇక ఉండదు. కాబట్టి, మంత్రి వర్గ విస్తరణపై ఇప్పటికే కేసీఆర్ కి స్పష్టత వచ్చేసి ఉంటుంది. వచ్చే నెల తొలివారంలో కేబినెట్ విస్తరణ ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పనిలోపనిగా కవితకు మంత్రి పదవి ఇచ్చినా ఆశ్చర్యం లేదు.
కవితకు రాజ్యసభ సభ్యత్వం దక్కే అవకాశం ఉందనే మరో అభిప్రాయమూ వినిపిస్తోంది. ఢిల్లీలో కాస్త క్రియాశీలంగా ఉంటూ వచ్చిన వినోద్ కుమార్ ఈసారి ఓటమిపాలయ్యారు. కాబట్టి, కవితను రాజ్యసభకు పంపడం ద్వారా… అక్కడ కూడా ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేసుకోవాలని కేసీఆర్ ఆలోచించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వంతో స్నేహం కొనసాగించాలే తప్ప, కొత్తగా పొత్తులంటే ఇప్పుడు భాజపాకి అవసరం లేదు కదా. అయితే, కవితను రాజ్యసభకు పంపించే కంటే… రాష్ట్ర మంత్రిని చేస్తేనే ఆమె మరింత ప్రభావవంతంగా నిలుస్తారనేది తెరాస వర్గాల్లో కొందరి అభిప్రాయంగా తెలుస్తోంది. ఇక్కడ ఇంకో చిక్కు కూడా ఉంది. కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావులకు కూడా మంత్రి పదవులు తప్పనిసరిగా ఇవ్వాలి. వారితోపాటు, కవితకూ మంత్రి పదవి అంటే… ఒకే కుటుంబంలో ఇంతమంది మంత్రులా అనే విమర్శలు వస్తాయి. ఇప్పటికే కేటీఆర్, హరీష్ లు రెండు పవర్ సెంటర్లుగా మారారనే అభిప్రాయం ఉన్న నేపథ్యంలో… కవిత కూడా ఇక్కడే ఉంటే పరిస్థితులు ఇంకోలా మారే అవకాశాలనూ కొట్టిపారేయలేం కదా!