ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కానీ.. టీడీపీ నేతలకు తత్వం బోధపడలేదు. ప్రజల్లో తమ పట్ల ఎంత ఆగ్రహంతో ఉందో… కానీ.. స్పష్టంగా కాలేదు. అప్పటి వరకూ.. ఎవరూ నోరు మెదపడం లేదు అంటే… సానుకూలత అని అనుకున్నారు. కానీ అసలు విషయం మాత్రం వేరే అని ఎన్నికల ఫలితాల్లో తేలిపోయింది. అందుకే.. టీడీపీ ఎమ్మెల్యేలు బయట ప్రజలకు మొహం చూపించలేకపోతున్నారు. ఇలాంటి వాళ్లందరికీ… భిన్నంగా ఓ ఎమ్మెల్యే ప్రజల్లోకి వెళ్తున్నారు. ఫలితాలొచ్చిన రెండో రోజే… నిరాశ నుంచి బయటపడి పని ప్రారంభించారు.
తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి కృష్ణా జిల్లాలోనూ టీడీపీకి నిరాశజనక ఫలితాలొచ్చాయి. చివరికి .. పార్టీకి అండగా ఉంటుందనుకున్న సామాజికవర్గం కూడా.. మద్దతుగా నిలువలేదన్నట్లుగా ఫలితాలు వచ్చాయి. అలాంటి ఫలితాలు వచ్చిన నియోజకవర్గాల్లో పెనమలూరు ఒకటి. టీడీపీకి మద్దతుగా ఉండే సామాజికవర్గాలు.. ఆ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంటాయనే ప్రచారం ఉంది. అందుకే.. అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ విజయం ఖాయమనుకున్నారు. కానీ.. అక్కడ అనూహ్యంగా వైసీపీ అభ్యర్థి పార్థసారధికి భారీ మెజార్టీ లభించింది. ఈ ఫలితాలతో… బోడె ప్రసాద్ షాక్ తిన్నారు. ఒక రోజు పాటు ఆయన కోలుకోలేకపోయారు. కానీ వెంటనే… కార్యాచరణ ప్రారంభించారు.
ఫలితాలు వచ్చిన రెండో రోజే… తాను మాజీ ఎమ్మెల్యేలను అన్న భావన మర్చిపోయారు. తన ద్విచక్ర వాహనాన్ని తీసుకుని.. పూటకో కాలనీలో తిరుగుతున్నారు. ఇంటింటికి వెళ్లి.. తనకు ఓటు వేస్తే.. కృతజ్ఞతలు చెబుతున్నారు. ఓటు వేయని వారైతే… తనను క్షమించాలని కోరుతున్నారు. తనకు తెలిసి.. ఎలాంటి తప్పూ చేయలేదని… తప్పు చేసినట్లయితే.. క్షమించాలని చేతులు పట్టుకుని మరీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఒంటరిగా.. బోడె ప్రసాద్ బైక్ వేసుకుని.. తనకు పెద్దగా ఓట్లు రాని… ప్రాంతాలకు వెళ్తున్నారు. అందర్నీ కలిసి.. చెప్పాలనుకున్నది చెబుతున్నారు. అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు.
మొత్తానికి తెలుగుదేశం పార్టీ నేతలకు.. బోడె ప్రసాద్ దారి చూపిస్తున్నారని అనుకోవచ్చు. ఓడిపోయినప్పటికీ.. ఆయన నిరాశ చెందకుండా… ఐదేళ్ల పాలనా కాలంలో.. తను తప్పులు చేసినట్లు తేలితే… క్షమించాలని కోరుతున్నారు. టీడీపీ నేతలు కూడా.. ఎన్నికల వరకూ కాకుండా.. కార్యాచరణను ఇప్పుడే ప్రారంభించి… ప్రజలకు అండగా ఉంటే… కాస్త ప్రజాభిమానాన్ని పొందగలరనే అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది.