విక్టరీ వెంకటేష్ కు కథ సెట్ చేయడం అంటే అంత వీజీ కాదు. దగ్గుబాటి సురేష్ ను ఒప్పించగలగాలి. దర్శకుడు తేజ నేనే రాజు-నేనే మంత్రి మందు, తరువాత కూడా వెంకటేష్ కు ఓ కథ తయారు చేయాలని కిందా మీదా అయ్యారు. రోజుల తరబడి సురేష్ క్యాంప్ లో గడిపారు. కానీ కథ ఒకె కాలేదు. ముఖ్యంగా సెకండాఫ్ విషయంలో సురేష్ బాబు అసంతృప్తిని తేజ పోగొట్టలేకపోయారు. ఆఖరికి ఆ క్యాంపస్ ను వదిలేసారు.
అనిల్ సుంకరతో కలిసి ఆ కథనే మరింత మెరుగులు దిద్దినట్లు బోగట్టా. అదే ఇప్పుడు సీత సినిమాగా మారింది. సీత సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ చూసినపుడు అక్కడక్కడ వెంకటేష్ ఛాయలు కనిపిస్తాయి. ముఖ్యంగా పదిన్నరకు టీ, రెండు బటర్ బిస్కట్లు, పచ్చమాత్ర, ఎర్రమాత్ర డైలాగు గమనిస్తే వెంకీ గుర్తుకు వస్తాడు.
హీరో క్యారెక్టర్ ఎలివేషన్, జీరో హీరోయిజం ఇలా చాలా కారణాల వల్ల సురేష్ బాబు నో చెప్పి వుంటారు. ఇప్పుడు అదే నిజమైంది. ఫస్ట్ ఒకె అన్న టాక్ వచ్చింది. సెకండాఫ్ గాడి తన్నింది అన్న టాక్ మిగిలింది. అలాగే హీరో క్యారెక్టర్ సరిగ్గా డిజైన్ చేయకపోవడంతో, బెల్లంకొండ బాగా చేయలేదన్న కామెంట్ వచ్చింది.
మొత్తానికి నేనే రాజు నేనే మంత్రి మినహా మరో హిట్ సినిమా అన్నది తేజ ఖాతాలో గత పదేళ్లలో లేకుండా పోయింది.