ముఖ్యమంత్రిగా… జగన్ ఒక్కరే ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. 30వ తేదీన మధ్యాహ్నం 12.23 నిమిషాలకు.. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో… గవర్నర్ నరసింహన్ జగన్ ఒక్కరితోనే ప్రమాణస్వీకారం చేయిస్తారు. కొత్తగా మంత్రులెవరూ ప్రమాణం చేయబోవడం లేదు. ఈ విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఢిల్లీలో వెల్లడించారు.
30వ తేదీన జగన్ ఒక్కరే ప్రమాణస్వీకారం..!
ఆంధ్రప్రదేశ్లో కొత్త మంత్రులెవరు అనే చర్చ జోరుగా సాగుతోంది. దాదాపుగా.. అన్ని జిల్లాల్లోనూ… సీనియర్లు, జూనియర్లు మంత్రి పదవుల పై ఆశలు పెట్టుకున్నారు. చాలా మంది.. జగన్ను కలిసి.. స్వయంగా మీతో కలసి పని చేయాలని ఉందని… మనసులో మాట కూడా బయటపెట్టారు. అనూహ్యంంగా… అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు గెలవడంతో.. కేబినెట్ కూర్పుపై జగన్… మరింత విస్తృతంగా కసరత్తు చేయాల్సిన పరిస్థితిని ఏర్పరిచింది. అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలను కవర్ చేస్తూ… మంత్రి పదవుల పంపకం చేయాల్సి ఉంది. అదే సమయంలో.. సీనియార్టీని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇదంతా చేయాలంటే.. కొత్త కసరత్తు తప్పదని జగన్ భావించినట్లు తెలుస్తోంది. జూన్ ప్రథమార్థంలో… మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించే అవకాశం ఉంది.
సీనియర్లకు సర్దిచెప్పడానికే టైం..!
పార్టీ పెట్టినప్పటి నుండి తనతో ఉన్నవారు… మధ్యలో వచ్చిన సీనియర్లు.. అలాగే… పార్టీ కోసం… టిక్కెట్లను త్యాగం చేసిన మరికొందరు… అలాగే… ఎన్నికల ప్రచారంలో.. హామీ ఇచ్చిన మరికొందరు ఇప్పటికే.. పదవులపై ఆశల్లో ఉన్నారు. అదే సమయంలో ప్రతి జిల్లాలోనూ బొత్స, ధర్మాన లాంటి సీనియర్లు పోటీ పడుతున్నారు. అందుకే.. సీనియర్లందరికీ చాన్సివ్వలేని పరిస్థితి ఉంది. అలాగే.. కొంత మంది నూతన ఎమ్మెల్యేలకూ పదవులు ఇవ్వక తప్పదు. జగన్కు ఇవన్నీ తెలుసు. అయితే.. పదువులు ఎవరికి అయితే ఇవ్వడం లేదో.. వారినందర్నీ… మానసింకగా సిద్ధం చేయడానికి సమయం తీసుకునే అవకాశం ఉంది.
శాఖల వారీ సమీక్షల తర్వాతే విస్తరణ..!
జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం తర్వాత వారం రోజుల పాటు.. అన్ని శాఖల పరిస్థితిపై సమీక్షలు చేయనున్నారు. ప్రతీ శాఖపై… శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఆ తర్వాత.. అన్ని శాఖల పరిస్థితిపై ఓ అవగాహన తెచ్చుకుంటారు. అప్పుడు మాత్రమే.. కొత్తగా.. మంత్రి పదవులను ఎవరెవరికి కేటాయించాలో ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. నవరత్నాలతో పాటు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే… ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిలో క్లిష్టమే. అందుకే ఆదాయాన్ని పెంచుకునే పనులను జగన్ ముందుగా చేపట్టాల్సి ఉంది.