ఎన్డీఏకు కేంద్రంలో సంపూర్ణ మెజార్టీ ఉంది. బతిమాలడం తప్ప.. మరేమీ చేయలేమనని జగన్ చెప్పి.. స్నేహ హస్తం అందించి వచ్చారు. పార్టీ పరంగా అమిత్ షా, రామ్ మాధవ్‌లతో చర్చించి వచ్చారు. దాంతో… వైసీపీ వైఖరి తేటతెల్లమయింది. ఇక టీఆర్ఎస్ ఏం చేయబోతోంది..?.
ఐదేళ్లలో ఢిల్లీ స్థాయిలో బీజేపీకి సంపూర్ణ మద్దతిచ్చిన టీఆర్ఎస్..!
2014 ఎన్నికల్లో బీజేపీ , టీఆర్ఎస్ వేర్వేరుగా పోటీ చేశాయి. మొదట్లో మోడీపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కానీ తర్వాత కేంద్రంతో ఘర్షణ వల్ల రాష్ట్రానికే నష్టమని గుర్తించారు. ప్రాజెక్టులకు పనులు, అనుమతులు సాధించడం కష్టమని వ్యూహం మార్చుకున్నారు. అప్పటి పరిస్థితుల్లో లోక్ సభలో పూర్తి మెజార్టీ ఉన్నా రాజ్యసభలో టీఆర్ఎస్ మద్దతు అవసరం ఉండటంతో బీజేపీ కూడా స్నేహ హస్తం అందించింది. అసెంబ్లీ ఎన్నికల వరకూ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంతో సఖ్యతతో ఉన్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాల్లో కేంద్రానికి మద్దతుగా నిలిచారు. కేంద్రం కూడా సానుకూలంగా వ్యవహరించింది. తెలంగాణా ప్రభుత్వం కోరిన విధంగా చకచకా ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చేశారు. కొత్త జోనల్ విధానానికి వేగంగా అనుమతించేశారు. కానీ లోక్ సభ ఎన్నికల సమయంలో మాత్రం రెండు పార్టీల మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి.
కాంగ్రెస్ వైపు ఉంటారని.. ఎన్నికల సమయంలో లీకులు..!
కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేశారు. హంగ్ వస్తే తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతారన్న సంకేతాలిచ్చారు. నిజానికి పరిస్థితులు ఎలా ఉంటాయోనని బీజేపీ కూడా టీఆర్ఎస్ తో ఆచితూచి వ్యవహరించింది. కానీ లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మంచి విజయాలు నమోదు చేయడంతో పరిస్థితి మారిపోయింది. కేంద్రంలో బీజేపీ పూర్తి మెజార్టీ సాధించింది.. రాజ్యసభ లోనూ బీజేపీ కూటమికి మెజార్టీ ఉంది. దేశంలోని ప్రతీ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయాలనే ఎజెండాతో పని చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్త విస్తరణలో భాగంగా అవకాశం ఉన్న తెలంగాణా లో టీఆర్ఎస్ తో సఖ్యతగా ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణలో బీజేపీ విస్తరణపైనే అమిత్ షా దృష్టి..! టీఆర్ఎస్‌కు చిక్కులే..?
కేంద్రంలో టీఆర్ఎస్ అవసరం లేకపోయినా సఖ్యత తో ఉండటమే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందున్న ఏకైక ఆప్షన్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. భారీ ప్రాజెక్టుల కోసం కేంద్ర సహాయం అవసరం. అదనపు రుణాల కోసం కేంద్రం అనుమతి కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంతో సఖ్యత తప్ప మరోదారి లేదు.. విస్తరణ కాంక్ష తో ఉన్న బీజేపీ స్నేహ హస్తం ఇస్తుందా…? తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలిచి పార్టీ విస్తరణ కు అవకాశం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ కేసీఆర్ కు సహకరిస్తుందా అనే అనుమానం కలుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నిర్దయగా వ్యవహరించే అమిత్ షా అంగీకరిస్తారా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీజేపీతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ కు చిక్కులు తప్పక పోవచ్చన్న అంచనాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.