సాహోకి ఓ షాక్. ఈ సినిమా నుంచి సంగీత త్రయం తప్పుకొంది. సాహో చిత్రానికి శంకర్ – ఎహసాన్ – లాయ్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ముగ్గురూ ఈ టీమ్ నుంచి బయటకు వచ్చేశారు. `అనివార్య కారణాల వల్ల ఈ సినిమా చేయలేకపోతున్నామని` ఈ సంగీత త్రయం ట్విట్టర్‌లో పేర్కొంది. దాంతో.. సాహో టీమ్ కొత్త సంగీత దర్శకుడి వేటలో పడింది.
సాహో సమస్యల్లో సంగీతం ఒకటి. శంకర్ – ఎహ్‌సాన్ -లాయ్… బాలీవుడ్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించారు. అయితే… దక్షిణాది నాడి మాత్రం వీళ్లకు అంతగా తెలీదు. ఇక్కడి స్టైల్, మాసిజం పసిగట్టలేకపోయాయి. వీళ్ల పాటల్లో వెస్ట్రన్ ఛాయలు మరీ ఎక్కువగా కనిపిస్తాయి. అవి తెలుగు ప్రేక్షకులు ఎక్కే ఛాన్సులు చాలా తక్కువ. సరిగ్గా ఇక్కడే సుజీత్ కీ ఈ సంగీత త్రయానికీ మధ్య గ్యాప్ వచ్చినట్టు తెలుస్తోంది. సంగీత దర్శకులు ఇచ్చిన ట్యూన్లు.. సుజిత్‌కి నచ్చకపోవడం, మార్పులూ చేర్పులూ చెప్పినా – ఆట్యూనులు మారకపోవడంతో సుజిత్ బాగా ఇబ్బంది పడ్డాడట. `ఇన్నిసార్లు మార్చమంటే మావల్ల కాదు` అనే టైపులో శంకర్ – ఎహ్ సాన్ – లాయ్‌లు విసుకున్నారని సమాచారం. పాటలు ఇవ్వడంలోనూ చాలా జాప్యం చేశారని, ఈ విషయంలో చిత్రబృందానికీ సంగీత త్రయానికీ మధ్య వాదోపవాదాలు జరిగాయని, కేవలం ట్యూన్ల కోసమే నెలల తరబడి సుజిత్ ముంబై వెళ్లి వచ్చేవాడని చెబుతున్నారు. ఇప్పటికే మూడు పాటల్ని రికార్డు చేశారు కూడా. ఆ పాటల్ని వాడతారా? లేదంటే వదిలేస్తారా? అనేది చూడాల్సివుంది. పాటలు రికార్డ్ చేసినా, వాటిని షూట్ చేయకపోవం వల్ల.. ఆర్థికంగా నష్టమేం వాటిల్లలేదు. ఇప్పటికిప్పుడు మరో సంగీత దర్శకుడ్ని వెదికి పట్టుకుని, ట్యూన్లు సిద్ధం చేసి, వాటినిచిత్రీకరించాలంటే.. పెద్ద పనే పడింది. మరి సాహోని భుజాలపై వేసుకునే ఆ సంగీత దర్శకుడు ఎవరో చూడాలి. ఈసారి కూడా బాలీవుడ్ వైపే చూస్తారా? లేదంటే దక్షిణాది సంగీత దర్శకుడ్ని నమ్ముకుంటారా? అనేది తేలాల్సివుంది.