వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అంత వరకూ బాగానే ఉన్నా.. ఫలితాలు వెలువడినప్పటి నుంచి.. కొన్ని సున్నితమైన నియోజకవర్గాల్లో పరిస్థితి తేడాగా ఉంది. వైసీపీ నేతలు అత్యుత్సాహంతో.. ఏదో ఘర్షణ పడటమో.. కత్తులు కటార్లతో ర్యాలీలు నిర్వహించడమో చేస్తున్నారు. ఓ చోట అయితే.. జంతువును బలి ఇచ్చి ఆ.. రక్తంతో.. వైఎస్ విగ్రహానికి అభిషేకం చేశారు. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఇలాంటి వీడియోలతో.. వైసీపీ విజయోత్సాహాలపై ఓ రకమైన ముద్ర పడుతోంది.
టీడీపీ కార్యకర్తలపై వరుస దాడుల ఘటనలు..!
ఇరవై మూడో తేదీన కొంటింగ్ జరిగినప్పటి నుంచి… వైసీపీ శ్రేణులు దూకుడుగానే ఉన్నాయి. ఎంతగా అంటే.. ఇక ప్రభుత్వం తమదే.. తాము ఏది చేసినా చెల్లుతుందన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. స్థానిక పోలీసులు కూడా.. వారిని ఏమీ అనలేని పరిస్థితి ఏర్పడింది. దాడులు చేస్తున్నా… పోలీసులు నిస్సహాయులై ఉంటున్నారు. ఇలాంటి పరిణామాలతో… ముందస్తుగా కొంత మంది పోలీసు అధికారులు.. సున్నితమైన ప్రాంతాల్లో రక్షణ ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ… కొన్ని చోట్ల పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతూనే ఉన్నాయి.
ఎస్కేయూ రెక్టార్పై దాడికి యత్నం..! బలవంతపు రాజీనామా..!
గ్రామాల్లో ఉండే రాజకీయ కక్షలు.. ఒకెత్తు అయితే .. అనంతపురంలోని శ్రీకృష్ణ దేవరాయ యూనివర్శిటీలో.. వైసీపీ విద్యార్థి నేతల పేరుతో కొంత మంది చేసిన హడావుడి… అందరికీ విస్మయం కలిగించేలా చేసింది. ఫలితాలు వచ్చిన మూడో రోజున… విద్యార్థి నేతలు… అడ్మినిస్ట్రేషన్బ్లాక్లోకి చొరబడ్డారు. విధుల్లో ఉన్నతాధికారులతో.. బలవంతంగా రాజీనామా పత్రాలపై సంతకాలు చేయించారు. ఒక్క సారిగా వందలాది మంది… రావడంతో.. దాడి చేస్తారేమోనన్న భయంతో… ఉన్నతాధికారులు కూడా రాజీనామా పత్రాలు అందించేశారు. మొదట.. మహిళా అధికారి అయిన ఎస్కేయూ రెక్టార్ శుభ చాంబర్లోని నేమ్బోర్డును ధ్వంసం చేశారు. మా ప్రభుత్వం వచ్చింది… మీ సేవలు ఇక చాలంటూ వెళ్లిపోవాలని ఆదేశించారు. తెల్ల కాగితంపై ఆమె రాజీనామా లేఖను తీసుకుని.. విద్యార్థి విభాగం నాయకులే వీసీకి పంపారు. ఓఎస్డీ ఏవీ రమణను కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతో ఆయన కూడా రాజీనామా చేశారు.
ఉద్యోగులపై ఈ దండనేంది..?
నిజానికి రెక్టార్ కానీ.. ఓఎస్డీ పదవులు కాని నామినేటెడ్ పోస్టులు కావు. వారు… ఉద్యోగులే. అయినా వారేతో… ఏపీ ప్రభుత్వ హయాలంలో.. నియమితులయ్యారు కాబట్టి… వారు టీడీపీ నేతలన్నట్లుగా.. అనంతపురం వైసీపీ నేతలు వ్యవహరించి… అత్యంత దారుణంగా ప్రవర్తించారు. ఈ వ్యవహారం వివాదంగా మారుతోంది. ఈ చర్యలకు వైసీపీ పై స్థాయి నేతల ప్రొత్సాహం ఉంటే… చెప్పలేము కానీ… మామూలుగా అయితే.. ఇది ఆ పార్టీ ఇమేజ్ను మసకబరిచేదే..!