లోక్ సభ ఎన్నికల్లో సీఎం కుమారుడు కేటీఆర్ సారథ్యంలో పార్టీ శ్రేణులు పనిచేశాయి! కానీ, అనుకున్న స్థాయిలో విజయం దక్కలేదు. సారు కారు పదహారు అనుకున్నారుగానీ… చాలాచోట్ల తెరాస దాదాపు ఓడినంత పనైంది. దీంతో, ఇప్పుడు పరువు దక్కించుకోవడానికి మారి ముందున్న మరో అవకాశం… హుజూర్ నగర్ ఉప ఎన్నిక! పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయన ఎంపీగా గెలిచారు కాబట్టి, ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం అవుతోంది. దీంతో హుజూర్ నగర్ లో తెరాస అభ్యర్థిని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకుని తీరాలనీ, ఉత్తమ్ సొంత ఇలాఖాలోనే కాంగ్రెస్ ని ఓడించాలనే పట్టుదలతో తెరాస ఉన్నట్టు సమాచారం. ఈ ఉప ఎన్నిక బాధ్యతను కేటీఆర్ కి అప్పగించినట్టుగా తెలుస్తోంది. ఇకపై ఆ నియోజక వర్గం మీద ఆయన ప్రత్యేక దృష్టి సారిస్తారని తెరాస వర్గాలు అంటున్నాయి. అయితే, ఉత్తమ్ సొంత నియోజక వర్గంలో తెరాస గెలుపు అనేది అనుకున్నంత ఈజీగా కనిపించడం లేదు.
గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ చేతిలో దాదాపు 14 వేల ఓట్ల తేడాతో తెరాస అభ్యర్థి సైదిరెడ్డి ఓడిపోయారు. లోక్ సభ ఎన్నికలకు వచ్చేసరికి… ఇదే నియోజక వర్గంలో ఉత్తమ్ కు మరింత ఓటు బ్యాంకు పెరిగింది. అయితే, ఈసారి ఉప ఎన్నిక వస్తోంది కాబట్టి… మరోసారి తనకే సీటు కావాలని సైదిరెడ్డి పట్టుబడుతున్నట్టు సమాచారం. కానీ, ఆయన స్థానంలో ఎప్పట్నుంచో మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్న గుత్తా సుఖేందర్ రెడ్డిని నిలబెడితే ఎలా ఉంటుందనే చర్చ తెరాసలో జరుగుతోంది. ఓ దశలో… కేసీఆర్ కుమార్తె కవితను హుజూర్ నగర్ బరిలోకి దించితే బాగుంటుందనే ఆలోచన కూడా తెరాసలో చర్చకు వచ్చినట్టు సమాచారం. సైదిరెడ్డిని కాదని వేరే అభ్యర్థికి సీటు ఇస్తే… ఆయన అసంతృప్తికి గురికావడం ఖాయం అంటున్నారు. ఇక, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి బరిలోకి దిగుతారని అంటున్నారు. మొత్తానికి, తెరాసకు ఈ ఉప ఎన్నికల గెలుపు నల్లేరు మీద నడకేం కాదు.
ఏదేమైనా, హుజూర్ నగర్ ఉప ఎన్నిక తెరాసకు ఇజ్జత్ కా సవాల్ కాబోతోంది. కేటీఆర్ సమర్థతపై కూడా ఈ మధ్య కొంత చర్చ జరుగుతోంది. ఆయన సొంత నియోజక వర్గం ఉన్న కరీంనగర్ లో కూడా తెరాస ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో తన సత్తా చాటుకోవాలంటే… హుజూర్ నగర్ లో గులాబీ జెండాను ఎగరెయ్యాల్సిందే. ఒకప్పుడు… ఉప ఎన్నికలు ఏవి జరిగినా తెరాస ఏకపక్షంగా గెలుస్తూ వచ్చేది. కానీ, ఇప్పుడీ ఉప ఎన్నిక దగ్గరకు వచ్చేసరికి… చెమటలు పడుతున్న పరిస్థితి తెరాసలో కనిపిస్తోంది.