ఎన్టీఆర్ జయంతి, వర్థంతి ఏదొచ్చినా సరే – హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ కళకళలాడిపోయేది. ఎన్టీఆర్ సమాధి… పూలతో తళుకులీనేది. అయితే ఈసారి అలాంటి ఏర్పాట్లేం జరగలేదు. ఏపీ ఎన్నికలలో తెలుగుదేశం చిత్తు చిత్తుగా ఓడిపోవడం వల్లేమో.. ఆ పెద్దాయన జయంతి సంగతిని లైట్ తీసుకున్నారు ఎన్టీఆర్ అభిమానులు. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఎలాంటి ఏర్పాట్లూ చేయలేదు. దాంతో… జూ,ఎన్టీఆర్ అసహనం వ్యక్తం చేశాడు. ఈ రోజు తెల్లవారుఝామునే ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఇద్దరూ కలసి ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకు చేరుకున్నారు. తాతయ్యకు నివాళులు అర్పించారు. కానీ ఆ సమయంలో ఎన్టీఆర్ సమాధిమీద పూలు లేకపోవడంతో ఎన్టీఆర్ అసహనం వ్యక్తం చేశాడు. తన అభిమానులకు చెప్పి, అప్పటికప్పుడు పూల దండలు రప్పించాడు. తనే స్వయంగా ఎన్టీఆర్ ఘాట్‌ని అలంకరించాడు. ఇక మీదట.. ఎన్టీఆర్ ఘాట్ అలంకరించే ఏర్పాట్లు తానే చూసుకుంటానని చెప్పాడు. నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయాడు. అధికారం చేతిలో ఉన్నప్పుడూ, లేనప్పుడూ ఎంత మార్పో కదా? కనీసం పెద్దాయనకి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీని స్థాపించి, ఆ పార్టీకీ, తెలుగుజాతీకి ఓ గౌరవం తీసుకొచ్చిన నాయకుడ్ని గుర్తించుకోవాల్సిన విధానం ఇదేనా..?? పార్టీ అధికారంలోకి లేకపోతే… ఆ పెద్దాయన్ని కూడా మర్చిపోతారా? దారుణం కదూ!