సార్వత్రిక ఎన్నికల్లో ఏ మాత్రం పుంజుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పరిణామాలు… అనుకోని మలుపులు తిరుగుతున్నాయి. ఓ వైపు బీజేపీ విజయం.. మరో వైపు .. మోడీ ప్రమాణస్వీకారం ఏర్పాట్లు… వంటి అంశాలతో మీడియా ఫోకస్ మొత్తం… బీజేపీ వైపే ఉండగా.. కాంగ్రెస్లో మాత్రం… అంతకు మించిన పరిణామాలు జరుగుతున్నాయి. దానిపై ఇప్పుడిప్పుడే అసలు విషయాలు బయటకు వస్తున్నాయి.
రాజీనామాపై వెనక్కి తగ్గని రాహుల్ గాంధీ..!
కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. రాహుల్ గాంధీ ఫలితాలు వచ్చిన తర్వాతి రోజే రాజీనామా లేఖను… కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి పంపారు. ఆ తర్వాత రోజే సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ… రాహుల్ సమక్షంలోనే… ఆయన నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేస్తూ.. రాజీనామాను తిరస్కరించింది. కానీ రాహుల్ గాంధీ మాత్రం… తాను… సీడబ్ల్యూసీ విశ్వాసం కోసం… రాజీనామాను చేయలేదని… స్వచ్చందంగా పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నానని… మీరే ఎవరైనా… బాధ్యతలు తీసుకోవాలని నిస్సంకోచంగా తేల్చిచెప్పారు. లోపల ఏం జరిగిందనేదానిపై బయటకు రాకపోయినా… రాజీనామా ఉపసంహరణ విషయంలో రాహుల్ గాంధీ మాత్రం వెనక్కి తగ్గలేదని మాత్రం కాంగ్రెస్ లోని పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
సీడబ్ల్యూసీలో ఏం జరిగిందో గోప్యం ఎందుకు..?
అదే సమయంలో.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోని సీనియర్లపై… సమావేశంలో… రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ మండిపడినట్లు ప్రచారం జరుగుతోంది. ఎవరికి వారు వ్యక్తిగత స్వార్థాలను చూసుకుని… బీజేపీపై పోరాడలేదని.. భారం మొత్తం రాహుల్ గాంధీపై వదిలేశారన్న అభిప్రాయం.. గాంధీ కుటుంబం వైపు నుంచి వచ్చింది. వారసుల కోసమే పార్టీని భ్రష్టు పట్టించారని… రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా మీడియాలో ప్రచారం జరిగింది. అయితే.. లోపలేం జరిగిందన్నదానిపై… మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగినా… అంతిమంగా రాహుల్ గాంధీ మాత్రం… పార్టీ అధ్యక్ష పదవిని వదులుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
దేశం కోసం త్యాగాలు చేసినా కుటుంబానికి అవమానాలెందుకన్న రాహుల్ భావన..!?
మూడు రోజులుగా.. రాహుల్ గాంధీకి పార్టీ సీనియర్ నేతలు పలు విధాలుగా .. సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. ఆయన మెత్తబడటం లేదు. ఈ లోపు.. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ… ఒక్కో రాష్ట్ర పీసీసీ చీఫ్ లు రాజీనామాలు చేస్తున్నారు. అయితే ఆయా రాజీనామాలు ఆమోదం పొందుతున్నాయో లేదో తెలియడం కాదు… రాజీనామాల పర్వం మాత్రం ఊపందుకుంటోంది. ఇప్పటికైతే.. గాంధీయేతర కుటుంబం నుంచి.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడ్ని ఎంపిక చేసుకోవాల్సిందేనని.. రాహుల్ గాంధీ పట్టు బడుతున్నారు. కుటుంబపాలన.. కుటుంబ పార్టీ అంటూ.. మోడీ ఎన్నికల్లో విమర్శలు చేయడమే కాదు.. పూర్వీకులపై కూడా… విమర్శలు చేశారు. చివరికి రాజీవ్ గాంధీని కూడా.. మోడీ వదిలి పెట్టలేదు. దారుణంగా విమర్శలు ఇది రాహుల్ గాంధీని తీవ్రంగా మనస్థాపానికి గురి చేసిందంటున్నారు. అందుకే.. కాంగ్రెస్కు.. గాంధీయేతర కుటుంబం నుంచి అధ్యక్షుడు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.