సారు.. కారు.. పదహారు.. ఢిల్లీలో సర్కారు… ఈ నినాదంతో పదహారు ఎంపీ సీట్లు గెలిపించే బాధ్యతను తలకెత్తుకున్నారు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే, ఫలితాలు అనూహ్యంగా వచ్చాయి. కాంగ్రెస్, భాజపాలు రాష్ట్రంలో పుంజుకున్నాయి. ఈ పరిస్థితిపై కేటీఆర్ మాట్లాడుతూ… ఈ ఫలితాలను భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదన్నారు. మల్కాజ్ గిరిలో కాంగ్రెస్ గెలపు గెలుపే కాదన్నారు. మూడు సీట్లలో వారు గెలిస్తే… దాన్ని ఘనమైంది అనుకోకూడదన్నారు. దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం ఉందనీ, దాన్లో భాగంగానే తెలంగాణలో భాజపాకి కొన్ని సీట్లు దక్కాయన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చూసుకుంటే… తెరాసకు దక్కిన ఓటింగ్ శాతంలో పెద్దగా మార్పు లేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
భాజపాతో సంబంధాలపై మాట్లాడుతూ… రాజ్యాంగబద్ధమైన సంబంధాలు కేంద్రంతో కొనసాగుతాయన్నారు. రాష్ట్ర సమస్యలపై పోరాటం చేస్తామని చెప్పారు. ప్రతిపక్ష పాత్ర పోషించే స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదనీ, భాజపాకి ధీటుగా ఏనాటికైనా నిలబడేవి ప్రాంతీయ పార్టీలు మాత్రమే అని కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో మెజారిటీ తగ్గిన మాట వాస్తవమేననీ, అన్నీ విశ్లేషించుకుంటామనీ, ఒక ఓటమి ఎదురైనంత మాత్రాన ఇంట్లో పడుకునే నాయకులు తెరాసలో లేరని వ్యాఖ్యానించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తాను ఫెయిల్ అయానని అనుకోవడం లేదన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్, భాజపాలు నెమ్మదిగా పుంజుకుంటున్న తీరును కేటీఆర్ కొట్టిపారేసే విధంగా మాట్లాడారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కొన్ని నెలల తరువాత ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. రెండోసారి అధికారం చేపట్టాక తెరాస సర్కారు ఉదాసీన వైఖరి వహిస్తోందనీ, మంత్రి వర్గ ఏర్పాటు కూడా నెలల తరబడి నాన్చుతోందనీ, పాలనను గాలికి వదిలేసిందనీ… ఇలా కొన్ని అంశాలు తీవ్ర చర్చనీయమయ్యాయి. ఎన్నికల ఫలితాలను ఇవి కచ్చితంగా ప్రభావితం చేశాయి. భాజపాకి రాష్ట్రంలో బేస్ దొరికింది. జీహెచ్ ఎంసీ ఎన్నికలను భాజపా ప్రతిష్టాత్మకంగా తీసుకుని బలపడే ప్రయత్నాలు మొదలుపెట్టే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ కి కూడా కొంత పట్టు దొరికింది. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి తెరాసకు ధీటుగా సమాధానం ఇచ్చే స్థానానికి వచ్చేశారు. మల్కాజ్ గిరిలోనే తీసుకుంటే…. ఆ పరిధిలోకి ఎమ్మెల్యేలంతా తెరాస సభ్యులే. ఇకపై, మల్కాజ్ గిరి పరిధిలో జరిగే శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రోటోకాల్ ప్రకారం రేవంత్ రెడ్డిని తప్పనిసరిగా ఆహ్వానించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అవకాశాలను ఆయన సద్వినియోగం చేసుకుంటారు! రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల కార్యకలాపాలూ గతం కంటే తీవ్రతరం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్, భాజపాలకి దక్కిన సీట్లు తక్కువే కావొచ్చు… కానీ, ఈ విజయం ద్వారా ఆ పార్టీలకి వచ్చిన రెట్టించిన ఉత్సాహాన్ని తక్కువగా చూడకూడదు.