రాజకీయాల్లో ప్రత్యర్థులు లేకుండా చేసుకోవాలనుకోవడం సాధ్యమా..?. అధికారం అండతో.. అందర్నీ నిర్వీర్యం చేస్తే.. ఇక అధికారానికి ఢోకా ఉండదా..? బెంగాల్, తెలంగాణలను కేస్ స్టడీగా తీసుకుంటే.. ప్రత్యర్థి రాజకీయ పార్టీలను లేకుండా చేసి.. అప్రతిహతంగా అధికారం అనుభవించాలనుకున్న రాజకీయ పార్టీలు… అంత కంటే పెద్ద సవాళ్లను.. తయారు చేసుకున్నట్లయింది. ఇప్పుడు.. ఆ ప్రత్యర్థే ఇంతింతై పెరిగిపోతున్నారు.
బెంగాల్లో బీజేపీ పెరగడానికి మమతా బెనర్జీనే కారణం..!
బెంగాల్లో.. కమ్యూనిస్టులు దశాబ్దాల తరబడి పాలన సాగించారు. లెఫ్ట్ కంచుకోటను బద్దలు చేస్తూ.. మమతా బెనర్జీ… సుదీర్ఘ పోరాటంతో 2011లో అధికారపగ్గాలు చేపట్టారు. మమతా బెనర్జీ రాజకీయ పోరాటం.. ఓ విప్లవంలా సాగింది. అలాంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత విపక్ష పార్టీలను నిర్వీర్యం చేయడం ప్రారంభించారు. లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు. పార్టీలో చేరేందుకు వచ్చిన వారిని చేర్చుకున్నారు. క్యాడర్‌ను భయపెట్టి….అయితే తృణమూల్‌కు పని చేయాలి.. లేకపోతే.. ఖాళీగా ఉండాలని.. నిర్ధేశించారు. ఫలితంగా… లెఫ్ట్ పార్టీలు నిర్వీర్యమయ్యే పరిస్థితికి చేరుకున్నాయి. దాంతో.. తృణమూల్‌కు ఎదురుండదని.. మమతా బెనర్జీ అనుకున్నారు. కానీ.. తనే స్వయంగా సృష్టించిన పొలిటికల్ వాక్యూమ్‌లోకి.. బీజేపీ.. అత్యంత పకడ్బందీగా దూసుకొచ్చింది. ఆ రాష్ట్రంలో అత్యధికంగా 28శాతం మంది ముస్లింలు ఉన్నారు. మైనార్టీలపై మెజార్టీని ఉసిగొల్పే రాజకీయాలు చేసే బీజేపీకి అంత మంచి అవకాశం ఎక్కడైనా లభిస్తుందా..?. చాలా సులువుగా వామపక్ష భావజాలంతో నిండిపోయిన వారి మనసును… హిందూత్వ రాజకీయంతో నింపే ప్రయత్నం చేస్తూ బెంగాల్లో అడుగు పెట్టింది. అక్కడ తృణమూల్ తనకు ప్రత్యర్థి లేకుండా చేసుకోవడంతో.. మమతా బెనర్జీకి ప్రత్యామ్నాయం అనుకున్న వారంతా.. బీజేపీ వైపు మళ్లడం ప్రారంభించారు. ఇది ఎంతగా సాగిందంటే… భారతీయ జనతా పార్టీ పొడే గిట్టని.. సీపీఎం కార్యకర్తలు…భారతీయ జనతా పార్టీకి.. బహిరంగంగా మద్దతు పలికారు. వారి క్యాడర్ అంతా తమ పార్టీ పోటీలో ఉన్నప్పటికీ.. వారంతా బీజేపీకే ఓటేశారు. ఫలితంగా.. కంచుకోటనుకున్న బెంగాల్లో… లెఫ్ట్ తుడిచి పెట్టుకుపోయింది. అంటే ప్రత్యర్థిగా బీజేపీ ఎదిగిందంటే.. దానికి కారణం… మమతా బెనర్జీనే. ఆమె ప్రత్యర్థిని లేకుండా చేయాలనుకున్నారు….కానీ అంత కంటే బలమైన ప్రత్యర్థిని తయారు చేసుకున్నారు. ఇది స్వయంకృతాపరాథం.
తెలంగాణలో బీజేపీ ఎదిగింది కూడా కేసీఆర్ చలువతోనే..!
అధికారంతో ప్రత్యర్థులు లేకుండా చేయాలనుకున్న మరో పార్టీ.. తెలంగాణ రాష్ట్ర సమితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా స్వల్ప మెజార్టీతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్… తనకు ఎదురు లేకుండా చేసుకోవాలనుకున్నారు. మరో ప్రాంతీయ పార్టీ ఉంటే.. మనుగడ కష్టమవుతుందని అనుకున్నారేమో కానీ.. చాలా సులువుగా టీడీపీని టార్గెట్ చేశారు. దాదాపుగా.. ఆ పార్టీ తరపున గెలిచిన పదిహేను మంది ఎమ్మెల్యేల్నే కాదు.. కింది స్థాయి వరకూ… భయపెట్టో.. బెదిరించో.. బతిమాలో పార్టీలో చేర్చేసుకున్నారు. అదే సమయంలో…మరో ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీని కూడా వదిలి పెట్టలేదు. ఇక రెండో సారి గెలిచిన తర్వాత విశ్వరూపమే చూపించబోయారు. అప్పటికే టీడీపీ దాదాపుగా తుడిచిపెట్టుకోపోయింది. కాంగ్రెస్ తరపున గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో వీలైనంత మందిని చేర్చుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారు. దాదాపుగా పూర్తయింది. ఇక కాంగ్రెస్‌కు సింగిల్ డిజిట్ ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారని క్లారిటీ వచ్చింది. ఈ లోపే… పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ప్రజాతీర్పు.. ఆ తర్వాత వరుసగా…టీఆర్ఎస్ లో చేరిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలంతో పోల్చి చూస్తే… టీఆర్ఎస్కు తిరుగులేని శక్తి ఉండాలి. కానీ ఫలితాలు తిరగబడ్డాయి. ఆపరేషన్ ఆకర్ష్ వల్ల కాంగ్రెస్ బలహీనపడలేదు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎవరూ లేకపోయినా… ఎంపీ సీట్లను గెలుచుకున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం.. తెలంగాణ రాష్ట్ర సమితి.. ఓడిపోతుందని..కలలో కూడా.. ఊహించని కంచు కోటల్ని బద్దలు కొట్టేసింది. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ లాంటి .. లక్షల మెజార్టీతో గెలవాల్సిన చోట్ల.. పరాజయభారాన్ని మూటగట్టుకుంది. ఇక్కడ చూడాల్సింది.. ఆ మూడు నియోజకవర్గాల గెలుపోటముల కాదు.. మారిన తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని. తనకు ప్రత్యర్థులు లేకుండా… చేయాలని కేసీఆర్.. పన్నిన వ్యూహం రివర్స్ అయింది. ఇప్పుడు.. ఆ పార్టీ … టీఆర్ఎస్కే సవాల్‌గా మారుతోంది.
ప్రత్యర్థుల్ని నిర్వీర్యం చేస్తే అంతకు మించిన ప్రత్యామ్నాయం రెడీ..!
కాంగ్రెస్‌ను తగ్గించడానికి .. బీజేపీకి ఎంతో కొంత చనువిస్తున్నామని.. టీఆర్ఎస్ అధినేత అనుకున్నారు కానీ.. ఆ పార్టీ తన పార్టీకే ఎసరు పెడుతుందని అసలు ఊహించలేకపోయారు. బీజేపీ నేతల ప్లాన్లు, ప్రణాళిక అంచనా వేయలేకపోయారు. కానీ ఇప్పటికే చేయిదాటిపోయింది. బీజేపీ.. తెలంగాణలో.. ఓ రేంజ్‌లోకి దూసుకొచ్చింది. తెలంగాణలో ముస్లింల సంఖ్య అటూ ఇటూగా.. 20 శాతం వరకూ ఉంటుంది. ఇలాంటి అవకాశాన్ని బీజేపీ ఎప్పటికీ వదులుకోదు. కేంద్రంలో కానీ.. మరెక్కడైనా కానీ.. బీజేపీకి టీఆర్ఎస్ అవసరం లేదు. త్వరలో.. ముస్లింల రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చి… పరిస్థితిని మరో రేంజ్‌కు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇప్పుడు… కేసీఆర్‌కు కాంగ్రెస్ ప్రమాదకరంగా కనిపించడం లేదు. కానీ.. బీజేపీ మాత్రం కచ్చితంగా ప్రమాదకరంగా మారుతోంది. ప్రజాస్వామ్య రాజకీయంలో అలా అనుకుంటే అంత కంటే తప్పిదం ఇంకొకటి ఉండదని… తాజా రాజకీయ పరిణామాలతో తేలిపోయింది.