ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 30న జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుని ఫోన్ చేసి ఆహ్వానించారు. దీంతో, ఆయన వెళ్తారా వెళ్లరా అనే చర్చ జరిగింది. అయితే, ఈ కార్యక్రమానికి ఆయన హాజరు కావడం లేదని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ఇదే అంశమై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మీడియాకి చెప్పారు.
చంద్రబాబు అధ్యక్షత జరిగిన సమావేశంలో సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలా వద్దా అనే చర్చ జరిగిందనీ, వెళ్లేందుకు కొంత సానుకూలంగానే ఉన్నట్టుగా ఆయన కనిపించారన్నారు పయ్యావుల కేశవ్. అయితే, పార్టీకి చెందిన మెజారిటీ సభ్యులు వద్దు అని స్పష్టం చేశారని పయ్యావుల అన్నారు. ఎందుకు వద్దన్నారనేదానికి కారణం కూడా చెప్పారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా నిర్వహించేందుకు వైకాపా సిద్ధమౌతోందనీ, రాజ్ భవన్ లో జరగాల్సిన ప్రమాణ స్వీకారాన్ని ఒక రాజకీయ పార్టీ కార్యక్రమంగా వారు చేసుకుంటూ ఉంటే ఎలా వెళ్తామనే అభిప్రాయాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు వ్యక్తం చేసినట్టు కేశవ్ చెప్పారు. అంతేకాదు, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న కార్యక్రమాలకు ప్రతిపక్ష పార్టీలకు చెందినవారు హాజరైన సందర్భాలు గతంలో కూడా చాలా తక్కువే ఉన్నాయనీ, దీన్నొక ప్రత్యేకమైన అంశంగా చూడాల్సిన పనిలేదన్నారు పయ్యావుల.
జగన్ అభినందించేందుకు టీడీపీ నుంచి ఒక బృందం వెళ్తుందని తెలుస్తోంది. ప్రమాణ స్వీకారానికి ముందుగానీ, తరువాతగానీ… అపాయింట్మెంట్ ఇచ్చే సమయాన్ని చూసుకుని పార్టీ తరఫున అభినందనలు తెలుపుతారు. జగన్ ను అభినందిస్తూ… చంద్రబాబు నాయుడు ఒక లేఖ రాసే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి, ఇదో ప్రత్యేకమైన ఇష్యూ కాదు. అయితే, దీనికి టీడీపీ సభ్యుల నుంచి వ్యక్తం చేసిన కారణం కూడా ఒక సాకుగా మాత్రమే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం అంటే, అది అధికార పార్టీ విజయోత్సవ సభలానే ఉండటం సర్వ సాధారణం. రేపు వైకాపా శ్రేణులు సహజంగా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తాయి. అయితే, ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలకు చెందిన నాయకులు హాజరు కాలేకపోవడం కూడా అంతే సహజం!