“సాధించేవరకూ ఏదైనా అసాధ్యంగానే అనిపిస్తుంది..!” .. నెల్సన్ మండేలా అన్న ఈ మాటలు.. జగన్మోహన్ రెడ్డికి తెలుసో లేదో కానీ… ముఖ్యమంత్రి పీఠం దిశగా వేసిన ప్రతి అడుగులోనూ.. ఆయనకు.. ఈ భావనను మాత్రం స్ఫూర్తి మంత్రంగా… పఠించుకునే ఉంటారు. ఎందుకంటే.. ఆశ ఉండటం కాదు… దాన్ని సాధించాలనే పట్టుదల ఉండాలి. ఎంత కఠోరమైన శ్రమ అయిన పడటానికి సిద్ధపడాలి. జగన్ దానికి సిద్ధపడ్డారు. కష్టాలు పడ్డారు. పోరాడారు. చివరికి అనుకున్నది సాధించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.
పోరాడి ప్రజలు తనతో నడిచేలా చేసుకున్న జగన్…!
రాజకీయ పోరాటం అంటే మాటలు కాదు. ఇప్పుడు అధికారాన్ని ఎదురు నిలబడి.. అనుకున్నది సాధించాలంటే… చాలా ధైర్యం ఉండాలి. జగన్మోహన్ రెడ్డికి అది అవసరమైన దాని కన్నా ఎక్కువే ఉంది. తాను ఏది నమ్మితే.. దానికే కట్టుబడి పోరాటం చేయడం ఆయన నైజం. ప్రజాప్రయోజనాలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యహరిస్తోందని అనిపిస్తే… ఆయన ఎక్కడా రాజీపడలేదు. దానికో చక్కని ఉదాహరణ అమరావతి. ఆంధ్రుల సెంటిమెంట్ అమరావతి అని.. దాన్ని వ్యతిరేకిస్తే… ప్రజలు తిరస్కరిస్తారన్న ప్రచారం జరిగినా.. ఆయన వెనుకడుగు వేయలేదు. ఆ మొక్కవోని సంకల్పమే… జగన్‌కు విజయాన్ని సాధించి పెట్టింది. అదొక్కటే కాదు… ఐదేళ్ల కాలంలో.. ప్రభుత్వం తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని నిరసించారు. ప్రజల ముందు పెట్టారు. తన వాదనే కరెక్ట్ అని ప్రజలో అనిపించేలా.. ఓట్ల రూపంలో.. ఆదరణ పొందారు.
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు..!
వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఆవేశం పాళ్లు ఎక్కువని అనుకుంటారు. కానీ ఆయనకు అంతకు మించిన రాజకీయం తెలుసని.. ఐదేళ్లలోనే తేలిపోయింది. కేంద్రంతో..సాన్నిహిత్యం కోసం… జగన్మోహన్ రెడ్డి అనుసరించిన వ్యూహాలే దీనికి సంకేతం. రాజకీయ ప్రత్యర్థుల్ని వేటాడటంలో… గత ఐదేళ్ల కాలంలో.. నరేంద్రమోడీ.. ఎలాంటి మొహమాటాలు పెట్టుకోలేదని.. అనేక ఉదంతాలు వెలుగు చూశాయి. పాత కేసుల్ని బయటకు తీసి లాలూను జైలుకు పంపారు. తెల్లవారే సరికి ప్రమాణం చేయాల్సిన శశికళ… జైల్లో తేలారు. ఇలాంటివి చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా.. వ్యవహరించారు. విభజన హామీల కోసం టీడీపీ పట్టుబట్టేలా చేసి… బీజేపీతో దూరం పెరిగేలా చేయగలిగారు. అదే సమయంలో… బీజేపీతో వ్యూహాత్మక సాన్నిహిత్యం పెంచుకున్నారు. దీని వల్ల ఏపీ ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని.. టీడీపీ అనుకుంది కానీ.. అసలు రాజకీయం మాత్రం జగనే అంచనా వేయగలిగారు. ఫలితంగా.. నేడు ముఖ్యమంత్రి అయ్యారు. అంటే.. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలుసని తేలిపోయింది.
స్పష్టమైన విజన్… అంతకు మించి కార్యదక్షత..!
జగన్మోహన్ రెడ్డికి ఇప్పటి వరకూ.. పరిపాలించే అవకాశం రాకపోవచ్చు. ఇదే మొదటిసారి కావొచ్చు. ఆయన ఆయన తన .. పదేళ్ల రాజకీయ జీవితంలో… ఢక్కామొక్కీలు తిన్నారు. ఎంపీగా ఎన్నికైన తొలి ఏడాదిలోనే.. అసలైన సవాల్‌ను ఎదుర్కొన్నప్పటికీ.. వెనుదిరిగి చూడలేదు. ఓదార్పు యాత్రలతో ప్రారంభించి పాదయాత్ర వరకూ.. ఎక్కడికక్కడ ప్రజల్లోనే ఉన్నారు. నిరాటంక పోరాటంచేశారు. అయితే అది గుడ్డిగా సాగలేదు. పార్టీని నడపడంలో తన కార్యదక్షతను చూపారు. పార్టీ నేతలపై అమితంగా ఆధారపడలేదు. ఎవరికి ఎంత అవకాశం ఇవ్వాలో .. అంత వరకే ఇచ్చారు. విజయడానికి ఎంత కష్టంకావాలో.. ఎంత విజన్ కావాలో.. ఎలాంటి నేతలు అవసరమో.. దానికి తగ్గట్లుగానే జగన్.. తన కార్యదక్షత చూపించారు.
తండ్రిని మించిన తనయుడిగా చరిత్రకెక్కే సందర్భం..!
ఒక్క చాన్స్ ఇస్తే.. ప్రతీ ఇంట్లోనూ.. మా నాన్న ఫోటో పక్కనే నా ఫోటో కూడా పెట్టుకునేలా.. గొప్ప పరిపాలన అందిస్తానని.. జగన్మోహన్ రెడ్డి… తన కోరికను.. ఒక్క ముక్కలో ప్రజలకు చెబుతూ ఉంటారు. అంటే.. వైఎస్‌ను మించిన సంక్షేమ సారధిగా… తాను పరిపాలిస్తాననేది ఆయన భావన. ఇప్పుడు జగన్‌కు అవకాశం ఉంది. ఆయన ధైర్యం.. పట్టుదల.. ప్రజలకు మంచి చేయాలన్న తపనతో… వైఎస్‌ను మించిపోయే.. పాలన చేయగలరనేది ప్రజల నమ్మకం. దాన్ని ఆయన నిలబెట్టుకోలేకపోవడానికి.. ఒక్క కారణం కూడా లేదు. అనుకున్నది సాధించాలని.. తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకుని.. ఆంధ్రప్రదేశ్ సంక్షేమ రాజ్యంపై తనదైన సంతకం చేస్తారని ఆశిద్దాం..! జయహో జగన్..!