తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు… ప్రగతి భవన్‌వైపు వెళ్లాంటేనే.. వణికిపోతున్నారు. ఒకప్పుడు.. ప్రగతి భవన్ తలుపులు తమ కోసం ఎప్పుడు తెరుచుకుంటాయా.. అని ఎదురు చూసేవారు. ఇప్పుడు… పిలుపు రాకపోతే బాగుండని అనుకుంటున్నారు. దానికి కారణం… పార్లమెంట్ ఎన్నికలే. లోక్‌సభ సీట్లలో..తమ తమ నియోజకవర్గాల్లో… మెజార్టీలు తేలేకపోవడంతో.. కేసీఆర్ ఏమంటారా.. అన్న భయంతో.. ఎమ్మెల్యేలు వణికిపోతున్నారు.
కంచుకోటల్లో బీజేపీకి వేల మెజార్టీ ఎలా..?
పార్లమెంట్ ఎన్నికల్లో సారు.. కారు… పదహారు..నినాదం తిరగబడి తొమ్మిది సీట్లకే పరిమితమైంది టీఆర్ఎస్. కంచుకోటలయిన కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌లలో ఓడిపోవడాన్ని కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. ఓడిపోయిన అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేల పని తీరుపైనే అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఫలితాలు వచ్చినప్పటి నుంచి.. కేసీఆర్ ముభావంగానే ఉంటున్నారు. ముఖ్యంగా … కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలతో కేసీఆర్ మాట్లాడటం లేదు. కొందరు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులతో కుమ్మక్కయ్యారని ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గట్టే భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి… కోమటిరెడ్డి బ్రదర్స్ తో కలిసి కూర్చుని మాట్లాడుతున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది.
కవిత ఓడిపోతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ చేసుకున్నారా..?
ఇక కేసీఆర్ కుమార్తె కవిత ఓటమికి నిజామాబాద్ పరిదిలోని కొందరు ఎమ్మెల్యేల వ్యవహారమే కారణమని ప్రచారం జరుగుతోంది. ఐదుగురు ఎమ్మెల్యేలు సరిగ్గా సహకరించక పోవటం తోనే కవిత ఓటమి పాలైందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కవిత ఓటమి పాలైన రోజు ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ చేసుకున్నారని… ఫోటోలు కేసీఆర్ చేతికి చిక్కినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని టీఆర్ఎస్ ధ్రువీకరించకపోయినప్పటికీ కవిత ను ఓడించేందుకు ఎమ్మెల్యేలే కుట్ర చేశారని కవిత సన్నిహిత వర్గాలు మండిపడుతున్నాయి. ప్రతిపక్షాలకు లీడ్ ఇచ్చిన నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అయితే అధిష్టానం నుంచి ఎలాంటి శిక్షకు గురికావాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఒక్క ఆర్మూర్ నియోజక వర్గం నుంచే బీజేపీ అభ్యర్థికి 35వేల ఓట్ల ఆధిక్యత వచ్చింది. సికింద్రాబాద్ లోక్ సభ పరిధిలోని అంబర్ పేట్ లో కిషన్ రెడ్డికి 45 వేల ఓట్ల ఆధిక్యత వచ్చింది.
ఎంత మంది మంత్రులకు ఊస్టింగ్ ఆర్డర్స్..!
నల్గొండ లోక్ సభ పరిధిలోని కోదాడ నియోజకవర్గం లో కాంగ్రెస్‌కు 12 వేల ఆధిక్యత వచ్చింది. కరీంనగర్ లోక్ సభ పరిధిలోని కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 52 వేలు, చొప్పదండిలో 56 వేలు, వేములవాడలో 25 వేల 8 వందలు, మానకొండూరులో 35 వేల పైచిలుకు ఓట్లు బీజేపీకి అధిక్యత వచ్చాయి. అదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఖానాపూర్ , నిర్మల్ నియోజకవర్గాల్లో 17 వేలు, ముధోల్‌లో 33 వేలు. మల్కాజిగిరి లోక్ సభ పరిధిలోని ఎల్బీనగర్ లో 27వేల 4 వందలు కాంగ్రెస్ కు ఆధిక్యత వచ్చింది. కొన్ని మంత్రుల నియోజకవర్గాలు కూడా.. ఇందులో ఉండటం… టీఆర్ఎస్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కేసీఆర్ ఆషామాషీగా వదిలి పెట్టరని.. ఏదో ఒకటి చేస్తారని టీఆర్ఎస్లో ప్రచారం జరుగుతోంది. అదే ఎమ్మెల్యేలను… ఆందోళనకు గురి చేస్తోంది.