విశాఖపట్నంలోని శారదా పీఠానికి వైకాపా నాయకులు క్యూ కడుతున్న పరిస్థితి! స్వామీ స్వరూనంద సరస్వతి ఆశీర్వాదం కోసం ఒక్కసారిగా నేతల తాకిడి పెరిగింది. వైకాపా అధికారంలోకి రావడంతో విశాఖ శారదా పీఠం ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. ఎందుకంటే, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకీ, ఎన్నికల్లో నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి, ముఖ్యమంత్రిగా ఇవాళ్ల మధ్యాహ్నం 12 గంటలకు ప్రమాణ స్వీకారం చేయడానికి… ఇలా అన్ని ముహూర్తాలూ ఆయన పెట్టినవే. అంతేకాదు, ఆ మధ్య జగన్, విజయసాయిరెడ్డిలతో సహా పలువురు వైకాపా నేతలతో ప్రత్యేక పూజలు కూడా ఆయనే చేయించారు. ఆ పూజల ఫలితమే జగన్ గెలిచారనేది వైకాపా నేతలకు బలంగా ఏర్పడ్డ నమ్మకం. జగన్ తో స్వామీజీ అత్యంత సన్నిహితంగా ఉంటున్నారనీ… స్వామీజీ ఏం చెప్పినా జగన్ చేస్తారనేది కొంతమంది వైకాపా నేతల అభిప్రాయం.
దీంతో మంత్రి పదవులు ఆశిస్తున్నవారు స్వామీజీ దగ్గరకి వెళ్తున్నారు. దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు స్వరూపానందను తాజాగా కలిసినవారిలో ఉండటం విశేషం. వీరంతా మంత్రి వర్గంలో స్థానం ఆశిస్తున్నవారు కావడం గమనార్హం. విశాఖ జిల్లాకి చెందిన కొందరు వైకాపా నేతలు స్వామీజీని కలిసినప్పుడు… మన జిల్లాకు ప్రాధాన్యత దక్కేలా మీరొక మాట జగన్ కి చెప్పిండి అంటూ వైకాపా ఎమ్మెల్యేలు అన్నారట! ఇలా ఆశీర్వాదం పేరుతో వస్తున్న ఆశావహులంతా… మీరు జగన్ కి ఓ మాట చెప్పాలనే కోరుతున్నట్టు సమాచారం.
అయితే, ఈ విషయంలో స్వామీజీ ముందు జాగ్రత్తతోనే వ్యవహరిస్తున్నట్టు సమాచారం. జగన్, కేసీఆర్ తన శిష్యులనీ, వారు ముఖ్యమంత్రులు కావాలని తన దగ్గరకి వచ్చారనీ, వాళ్లకి రాజయోగం ఉంది కాబట్టి యాగం చేశానని అన్నారట. తాను గురుస్థానంలో ఉన్నాను కాబట్టి, శిష్యులు వచ్చి అడిగితే ఆశీస్సులు ఇస్తాననీ… అంతేగానీ, ఫలానా పని చేసి పెట్టిండని తాను శిష్యులను ఎప్పుడూ అడిగే పరిస్థితి ఉండదని స్వరూపానంద చెప్తున్నట్టు సమాచారం. నా శిష్యులు ఇద్దరూ మంచి పాలన అందిస్తారనీ, అందరికీ మేలు జరుగుతుందని ఈ ఆశావహులకు స్వామీజీ చెబుతున్నట్టు తెలుస్తోంది. మంత్రి పదవుల విషయంలో తానైతే జోక్యం చేసుకునేది లేదన్నట్టుగా స్వామీజీ ఉన్నారు. కానీ, ఆశావహులు మాత్రం స్వామీజీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు.