కేంద్రంలో మరోసారి అధికారంలోకి రాగానే, రెండోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే ఆపరేషన్ ఆకర్ష్ ని తెర మీదకి తెచ్చేసింది భాజపా. ప్రస్తుతం భాజపా టార్గెట్… పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని పడగొట్టడం అనొచ్చు! ఆ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సందర్భంలో భాజపా ఎన్ని రకాల ప్రచార వ్యూహాలను తెర మీదికి తెచ్చిందో చూశాం. అయోధ్యలో కంటే… బెంగాల్ లోనే ఈసారి రామ నామాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా మోడీ షా ద్వయం వినిపించారు. ఎన్నికల ప్రచారంలో ఓ సారి మోడీ మాట్లాడుతూ… తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన 42 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని ప్రకటించారు కదా! ఇప్పుడు, మరోసారి అధికారంలోకి వచ్చాక బెంగాల్ లో భాజపా చేస్తున్న పని కూడా అదే. తృణమూల్ నుంచి పెద్ద సంఖ్యలో ఫిరాయింపులను భాజపా ప్రోత్సహిస్తోంది.
మొన్ననే.. ఇద్దరు తృణమూల్ ఎమ్మెల్యేలు భాజపాలో చేరారు. తాజాగా మూడో ఎమ్మెల్యే మునిరుల్ ఇస్లాం భాజపాలో చేరారు. ఈ సందర్భంగా భాజపా శ్రేణులు చెబుతున్నది ఏంటంటే… ముస్లింలు కూడా భాజపాతో ఉన్నారనీ, నరేంద్ర మోడీ నాయకత్వానికి మద్దతు పలుకుతున్నారనడానికి మునిరుల్ చేరికే సాక్ష్యం అని ప్రచారం చేస్తున్నారు. గడచిన లోక్ సభ ఎన్నికలు ఏడు దశల్లో జరిగాయనీ, ప్రతీ దశలోనే బెంగాల్ లో పోలింగ్ జరిగిందనీ, అదే తరహాలో మమతా బెనర్జీ పార్టీ నుంచి ఏడు దశల్లోనే వరుసగా ఎమ్మెల్యేలు భాజపాలోకి వచ్చి చేరుతారంటూ ఆ పార్టీ నేతలు ప్రకటనలు చేస్తూ ఉండటం విశేషం!
రెండోసారి కూడా అధికారంలోకి వచ్చేశాం కదా, ఇక మిగిలిన రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను ఎలాగైనా కూలదొయ్యొచ్చు అనేది మోడీ షా ద్వయం వ్యూహంగా కనిపిస్తోంది. అధికారం దక్కించుకోవాలంటే ప్రజలకు దగ్గరయ్యే విధంగా పార్టీ కార్యక్రమాలు ఉండాలి. అసెంబ్లీ ఎన్నికల వరకూ ఆగి, ప్రజల మద్దతు సాధించి విజయం పొందితే ఓ పద్ధతిగా ఉంటుంది. అంతేగానీ, ఫిరాయింపులను ప్రోత్సహించి… బెంగాల్ లో అధికారం దక్కించుకోవాలని చూస్తే… అది ప్రజా తీర్పునకు వ్యతిరేకం అవుతుంది. ప్రజా వ్యతిరేకతను కూడా భాజపా పెంచుకున్నట్టు అవుతుంది. లోక్ సభ ఎన్నికల్లో బెంగాల్ లో తమకంటూ కొంత ఉనికిని భాజపా ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం ద్వారా దాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి భాజపాకి భవిష్యత్తులో రావొచ్చు. కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీయే ఇలాంటి ఫిరాయింపు రాజకీయాలను ప్రోత్సహిస్తే… ప్రజాతీర్పునకు అర్థం ఏముంటుంది..?