కేంద్ర కేబినెట్లో ఎవరెవరు ఉంటారో.. ఇప్పటికే ఖరారయింది. అయితే..ఆ విషయం మోడీ, షాలకు మాత్రమే తెలుసు. కూర్పుపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. సంచలన విజయాలు సాధించిన రాష్ట్రాలు.. సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్రాలకు.. ప్రాధాన్యం దక్కనున్నట్లు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
సీనియర్లు, యుననేతల కలయికతో.. కేబినెట్ ఉండే అవకాశం ఉంది. గత కేబినెట్లో కీలక శాఖలు నిర్వహించిన వారికి మళ్లీ అవకాశం దక్కడం ఖాయమే. అనారోగ్య కారణాలతో సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ మాత్రం.. తమకు బాధ్యతలు వద్దని చెప్పేశారు. గత కేబినెట్లో రక్షణమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌కు.. ఈసారి మానవ వనరుల శాఖ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. రాహుల్ గాంధీపై విజయం తర్వాత.. స్మృతి ఇరానీకి మరింత ప్రాధాన్యత పెరగనుంది. విదేశాంగ శాఖ బాధ్యతలు ఇస్తారని చెబుతున్నారు. పియూష్ గోయల్‌కు ఆర్థిక శాఖ, ఇప్పటి వరకూ హోంమంత్రిగా ఉన్న రాజ్‌నాథ్ సింగ్‌కు ఏ శాఖ ఇస్తారో క్లారిటీ లేదు. అమిత్ షాకు మాత్రం హోం మంత్రి పదవి ఖాయమంటున్నారు.
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటోంది. అందుకే.., ఈ సారి కర్ణాటకకు ప్రాధాన్యం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. బెంగాల్లో బీజేపీ అంచనాలకు మించి స్థానాలకు గెలుచుకుంది. మధ్యప్రదేశ్‌లోనూ ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటున్నారు కాబట్టి..ఆ రాష్ట్రానికీ ప్రాధాన్యం దక్కనుంది. ఢిల్లీలోనూ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయ్. దీంతో కేబినెట్లో ఢిల్లీకి కూడా ప్రాధాన్యం కల్పించే అవకాశాలున్నాయి. మహారాష్ట్రలో శివసేన.. ఈ ఎన్నికల్లో మంచి విజయాలు సొంతం చేసుకుంది. 18 స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటింది. ఈ ఏడాది అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మహారాష్ట్రపై బీజేపీ ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతోంది. మంత్రివర్గంలో ప్రాధాన్యం కల్పించాలని భావిస్తోంది.
మిత్రపక్షాలకూ… బీజేపీ ప్రాధాన్యం ఇవ్వనుంది. బిహార్ నుంచి మిత్రపక్షం జేడీయూకు రెండు మంత్రిపదవులు ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. రైల్వేశాఖను జేడీయూ ప్రతినిధికే ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇక అటు మహారాష్ట్ర నుంచి ఇద్దరు శివసేన ఎంపీకు కేంద్ర మంత్రివర్గంలో బెర్త్ కన్ఫార్మ్ చేయనున్నారు. ముఖ్యంగా దక్షిణాదిపై బీజేపీ పెద్దలు ప్రత్యేక దృష్టి సారించారు. కర్ణాటకలో గతంతో పోలిస్తే ఎక్కువ సీట్లుసాధించడంతో.. బెర్త్‌లు కూడా పెరిగే చాన్స్ ఉంది. ఢిల్లీ నుంచి గౌతమ్ గంభీర్‌కి చాన్సిస్తారంటున్నారు. అన్నింటినీ కన్నా… ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే.. భోపాల్‌లో దిగ్విజయ్ సింగ్ పై గెలిచిన ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌కి కూడా మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం. ఎందుకంటే.. ఆమె గాడ్సేను దేశభక్తునిగా చెప్పినప్పుడు..మోడీ ఆమెను క్షమించబోనని ప్రకటించారు. కానీ ఇప్పుడు మంత్రి పదవి రేసులోకి రావడమే అనూహ్యం..!