మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి.. తన రాజకీయకార్యాచరణను.. చాలా పకడ్బందీగా… రూపొందించుకుంటున్నారు. తన గెలుపునకు సహకరించమని… ఎన్నికల ప్రచారంలో… ఎవరెవర్ని కలిశారో.. గెలిచిన తర్వాత అందరి ఇళ్లకు వెళ్లి కృతజ్ఞతలు చెబుతున్నారు. అందరిలోనూ ఓ సానుకూలతను తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దాంతోనే సరి పెట్టడం లేదు. టీఆర్ఎస్‌పై ఒంటికాలితో లేస్తున్నారు. టీఆర్ఎస్‌పై తన వాయిసే ఇప్పుడు… తెలంగాణలో గట్టిగా వినపడేలా చేసుకుంటున్నారు.
మల్కాజిగిరిలో రేవంత్ రెడ్డితి గెలుపే కాదని.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించడాన్ని తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు రేవంత్. అంతే కాదు.. తమకు ఓట్లు పెరిగాయంటూ.. చెప్పుకొచ్చిన విషయాన్ని కామెడీ చేసేశారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ పట్ల ప్రజల్లో తిరస్కరణ మొదలైందని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. కేటీఆర్ చేసిన విమర్శలపై ఓ బహిరంగలేఖ రాశారు. ఓటమికి కేటీఆర్ కుంటిసాకులు వెతికే పనిలో పడ్డారని సెటైర్ వేశారు. వాస్తవాన్ని జీర్ణించుకోలేక ఓటమికి కుంటిసాకులు వెతికే పనిలో పడ్డారంటూ కేటీఆర్‌పై విమర్శలు చేశారు.
తమకు ఇరవై లక్షల ఓట్లు పెరిగాయని.. కేటీఆర్ చెప్పారు. అయితే.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలతో ఆయన పోల్చి ఈ లెక్కలు చెప్పలేదు. ఐదేళ్ల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికలతో పోల్చి కేటీఆర్ ఈ లెక్క చెప్పారు. దీనిపైనే రేవంత్ మరో జోక్ వేశారు. ఐదు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కాదని ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల ఫలితాలతో… ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలను పోల్చుకోవడం కేటీఆర్ అతి తెలివికి నిదర్శనమన్నారు. 2008 ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓడిపోయిన విషయాన్ని ఈసందర్భంగా రేవంత్‌రెడ్డి లేఖలో ప్రస్తావించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నాలుగు నెలల వ్యవధిలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 20 లక్షల ఓట్లు తగ్గిపోయాయన్నారు. సిద్ధిపేట, సిరిసిల్లలోనే టీఆర్‌ఎస్ మెజార్టీలు దారుణంగా పడిపోయాయన్నారు. కరీంనగర్, నిజామాబాద్‌లో సీఎం కుటుంబ సభ్యులే ఓడిపోయారని… టీఆర్ఎస్ గ్రాఫ్ వేగంగా పడిపోతోంది అనడానికి ఇదే సంకేతం అంటూ రేవంత్ లేఖలో తేల్చి చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వంపై ఇక అగ్రెసివ్‌గా వెళ్లాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇప్పటి వరకూ ఆయన ఎక్కడ లేని నిర్బంధాలు ఎదుర్కొన్నారు. అనేక కేసులు ఆయనపై నమోదయ్యాయి. కొడంగల్ నియోజకవర్గంలో… ఓడిపోయారు. ఆ ఎన్నిక సమయంలో.. ఆయన ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆ తర్వాత మల్కాజిగిరి నుంచి పోటీ చేసి.. మొక్కవోని పట్టుదలతో విజయం సాధించారు. ఇప్పుడు.. తన కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. పీసీసీ చీఫ్‌గా ఆయన పేరును.. హైకమాండ్ పరిశీలిస్తోందన్న ప్రచారంతో… ఆయన మరింత దూకుడుగా ఉంటున్నారు. ఆ పదవి కూడా వస్తే.. తెలంగాణలో రాజకీయం మారిపోయే అవకాశం ఉంది.