వైయస్ జగన్ ప్రమాణస్వీకారం అట్టహాసంగా జరిగింది. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తాను ఇచ్చిన హామీలు అన్నింటినీ ఎలా అమలు చేస్తాడా అన్న కుతూహలంతో ఎదురుచూస్తున్న ప్రజలకు స్పష్టత ఇచ్చేలా జగన్ వృద్ధాప్య పెన్షన్ పై తన నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే రెండు వేల రూపాయలుగా ఉన్న పెన్షన్ ను మూడు వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ మొదటి రోజే తెలివిగా యు టర్న్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.
గతంలో 200 రూపాయలు గా ఉన్న పెన్షన్, దఫదఫాలుగా పెరుగుతూ వచ్చి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రెండు వేల రూపాయలకు చేరింది. అయితే దీన్ని మూడు వేల రూపాయలకు పెంచుతామని జగన్ హామీ ఇవ్వడంతో అవ్వ తాతలు జగన్ వైపు మొగ్గు చూపారు. తాను అధికారంలోకి రాగానే రెండు వేల రూపాయల నుంచి 3 వేల రూపాయలు చేస్తానని చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. ఈ పెన్షన్ను 2000 రూపాయల నుంచి కేవలం 250 రూపాయలు పెంచి, 2250/- చేశారు. ఇలా ఏడాదికి రెండు వందల యాభై రూపాయలు పెంచుతూ, నాలుగేళ్ల తర్వాత అది మూడు వేలకు చేరుతుందని ప్రకటించారు.
ఇలాంటి గారడీ టెక్నిక్ లతో స్కీమ్లను అమలు చేయడంలో చంద్రబాబే అనుకుంటే, జగన్ తాను చంద్రబాబును మించిపోయానని మొదటి రోజే నిరూపించుకున్నట్లుగా కనిపిస్తోంది. నిజానికి ఇలా ఏడాదికి రెండు యాభై రూపాయలు మాత్రమే పెంచే ఉద్దేశం తనకు ఉన్నట్లయితే, హామీ ఇచ్చేటప్పుడే ఆ విధంగా స్పష్టంగా చెప్పి ఉండాల్సింది అని జనం భావిస్తున్నారు. అప్పుడేమో రెండు వేల నుంచి మూడు వేల రూపాయలకు పెంచుతామని చెప్పి ఇప్పుడేమో ఏడాదికి 250 చొప్పున నాలుగేళ్లలో దానిని 3000 చేస్తానని చెప్పడం అవ్వ తాతలకి షాక్ ఇచ్చింది.
అయితే, జగన్ అధికారం చేపట్టింది ఇప్పుడే కాబట్టి మరి కొంతకాలం పాటు జగన్ తీసుకునే నిర్ణయాలను పరిశీలించాల్సి ఉంది. అలా చేయకముందే జగన్ పాలన మీద తీర్పు ఇవ్వడం సబబు కాదు. కానీ, మద్యపాన నిషేధం, ప్రత్యేక హోదా సాధన, అగ్రిగోల్డ్ బాధితుల సమస్య, ఫాతిమ కాలేజ్ విద్యార్థుల సమస్య, బడికి వెళ్లే విద్యార్థులకు 15వేలు, ఆటో నడిపే ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 10,000, రైతు బంధు కింద ఎకరానికి 12,500/- లాంటి హామీ ల విషయంలో జగన్ నిర్ణయాలు ఎలా ఉంటాయో వేచిచూడాల్సి ఉంది.