సభ్యసమాజం సిగ్గుతో తల దించుకొనే సంఘటన ఈరోజు బెంగళూరులో జరిగింది. టాంజానియా దేశానికి చెందిన ఒక యువతిని కొందరు వ్యక్తులు నడిరోడ్డు మీద బట్టలూడదీసి రోడ్ల మీద నగ్నంగా పరుగులెత్తించారు. ఆమె బెంగళూరులో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వస్తే ఆమె జీవితంలో మరచిపోలేని ఈ అవమానకరమయిన చేదు అనుభవం ఎదురయింది. ఇంతకీ ఆమె చేసిన నేరం ఏమిటంటే రోడ్డుపై ఒక కారు ప్రమాదం జరిగి ఒక మహిళ మరణిస్తే, మిగిలిన జనాలతో బాటు ఆమె కూడా అక్కడ ఏమి జరిగిందో చూడాలని వచ్చింది.
ఆ కారు ప్రమాదం చేసిన వ్యక్తి ఆ మహిళా మరణించింది అని తెలియగానే తన కారును అక్కడే వదిలిపెట్టి పారిపోయాడు. అతను కూడా విదేశీయుడే (సూడాన్ దేశస్థుడు) కావడం, అదే సమయంలో టాంజానియా విద్యార్ధిని అక్కడ ఉండటంతో ఆమే ఆ ప్రమాదం చేసి ఉంటుందని భావించిన జనాలు ఆగ్రహంతో ఆమెను, ఆమె స్నేహితురాలిని పట్టుకొని కొట్టారు. తరువాత ఆ కారును తగులపెట్టారు. ఇంకా వారి ఆవేశం చల్లారకపోవడంతో ఆమెను వివస్త్రను చేసి రోడ్ల మీద పరుగులు పెట్టించారు. ఆమె భయంతో కేకలు వేస్తూ సహాయం అర్ధిస్తూ రోడ్ల మీద పరుగులు పెడుతుంటే అందరూ సిగ్గుతో తలదించుకోవలసి వచ్చింది. ఆ సంగతి తెలిసుకొన్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను కాపాడారు. కేసు నమోదు చేసుకొని ఆమెపై దాడి చేసిన వారి కోసం వెతుకుతున్నారు.
ప్రపంచం అంతా ఇప్పుడు భారతదేశం వైపే చూస్తోందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పగా చెపుతుంటాయి. ఇటువంటి అత్యంత హేయమయిన సంఘటనలు కూడా చూసినపుడు భారత్ పరువు ప్రతిష్టలు మంట గలిసిపోతాయి. దేశంలో మహిళలు అర్ధరాత్రి రోడ్ల మీద ఎలాగూ తిరిగే సాహసం చేయలేరు. కానీ పట్టపగలు బెంగళూరు వంటి మహా నగరాలలో కూడా తిరగలేని పరిస్థితులున్నాయని చాటి చెప్పుతున్నట్లుంది ఈ సంఘటన.