అమెరికా, బ్రెజిల్ తో సహా మొత్తం 23 దేశాలను గడగడ లాడిస్తున్న జికా వైరస్ కి హైదరాబాద్ లోని భారత్ బయో టెక్ సంస్థ వ్యాక్సిన్ని తయారు చేసినట్లు ప్రకటించింది. ఈ ప్రాణాంతకమయిన వైరస్ కి వ్యాక్సిన్ కనుగొన్న దేశం మనదేనని ఆ సంస్థ సి.ఎం.డి. కృష్ణ ఎల్లా తెలిపారు.
ఆడిస్ అనే జాతికి చెందిన దోమ కాటు వలన కలిగే జికా వైరస్ భాదితులలో డెంగూ, ఎల్లో ఫీవేర్, వెస్ట్ నైల్ వైరస్ లక్షణాలు కనబడుతాయి. ఈ దోమలు పగటి పూటే ఎక్కువగా కనిపిస్తాయి. ఈ రకం దోమలు అభివృద్ధి చెందేందుకు చెంచాడు నిలువ నీళ్ళు ఉన్నా చాలు. దానిలోనే గుడ్లు పెట్టగలవు. సాధారణంగా ఈ దోమకాటుకి గర్భిణులు ఎక్కువగా గురవుతున్నారని ప్రపంచ దేశాలు గుర్తించాయి. ఈ జికా వైరస్ సోకిన మహిళలకి పుట్టిన శిశువులు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. దానినే వైద్య పరిబాషలో ‘మైక్రోసిఫాలి’ అని అంటారు.
ఈ సమస్యకి భారత్ బయో టెక్ సంస్థ వ్యాక్సిన్ తయారు చేయగలిగింది. సుమారు ఏడాదిగా జికా వైరస్ పై పరిశోధనలు చేసి ఈ వ్యాక్సిన్ని అభివృద్ధి చేసినట్లు ఆ సంస్థ పరిశోధన, అభివృద్ధి విభాగపు డైరెక్టర్ డా. సుమతి తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ ‘క్లినికల్ ట్రయల్స్’ జరుగుతున్నాయి. అందులో సంతృప్తికరమయిన ఫలితాలు రాగానే వ్యాక్సిన్ ఉత్పత్తి మొదలుపెడతామని ఆమె తెలిపారు. ప్రపంచంలో మొట్టమొదటిగా ఈ వ్యాక్సిన్ న్ని అభివృద్ధి చేసినందున దానిపై పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేసుకొబోతున్నట్లు సి.ఎం.డి. కృష్ణ ఎల్లా తెలిపారు.