సోమవారం నుంచి వరుసగా శాఖలవారీ సమీక్షా కార్యక్రమాలు పెట్టుకున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. మొదటిగా ఆర్థిక శాఖ రివ్యూ ఉంటుంది. అక్కడి నుంచి మొదలుపెడితే వ్యవసాయం, రెవెన్యూ… ఇదే క్రమంలో 6వ తేదీన సీఆర్డీయే రివ్యూ ఉంటుంది. ఆ సమీక్ష మీదే ఇప్పుడు అందరి దృష్టీ ఉంది. ఎందుకంటే, నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణమంతా సీఆర్డీయే పరిధిలోనే జరుగుతోంది కాబట్టి! రాజధాని నిర్మాణంపై జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏలా ఉంటుందనే ఆసక్తి కూడా అన్ని వర్గాల్లోనూ ఉన్న తెలిసిందే. వైకాపా అధికారంలోకి వస్తే రాజధానిని మార్చేస్తారా అనే చర్చ కూడా ఎన్నికల ప్రచార సమయంలో తీవ్రంగా జరిగింది. దీంతో, సీఆర్డీయే రివ్యూలో జగన్ ఎలా స్పందిస్తారనేది కొంత ఆసక్తికరంగా మారింది. అంతేకాదు… రాజధాని నిర్మాణ పనుల్లో నిమగ్నమైన కొన్ని ప్రముఖ కంపెనీలు కూడా సీఆర్డీయే రివ్యూపై ఉత్కంఠగానే ఉన్నాయి.
కాంట్రాక్టుల విషయంలో తాను ఎలా వ్యవహరిస్తానో అనేది తొలిరోజే సీఎం జగన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రివర్స్ టెండరింగ్ విధానం తీసుకొచ్చి… ఇప్పుడున్న కాంట్రాక్టులన్నీ మార్చేస్తామని అన్నారు. దీంతో, ఇప్పటికే రాజధానితోపాటు ఏపీలో కొన్ని పనులు చేస్తున్న కంపెనీలకు టెన్షన్ పట్టుకుంది. జగన్ ప్రకటన ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే… ఆంధ్రాలో దాదాపు రూ. 8 వేల కోట్ల విలువగల పనులు చేపడుతున్న ఎన్.సి.సి. కంపెనీ షేరు విలువ స్టాక్ మార్కెట్లో ఒక్క రోజులోనే రూ. 20 పడిపోయింది. ఈ కంపెనీకి దక్కిన కాంట్రాక్టులు రద్దయిపోతాయేమో అనే అనుమానాలతో కంపెనీ షేర్ ధర తగ్గిపోయింది. హుటాహుటిన మదుపరులకు ఆ కంపెనీ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ప్రస్తుతం సీఆర్డీయే పరిధిలో పనులు చేస్తున్న కంపెనీల భవిష్యత్తు ఏంటనేది జగన్ నిర్వహించబోయే సమీక్షలో తేలబోతోందనే చర్చ జరుగుతోంది. అంతేకాదు, సీఎం రివ్యూ చేయబోతున్నారు కాబట్టి… ప్రస్తుతం జరుగుతున్న పనుల్ని కూడా తాత్కాలికంగా నిలిపేయాలంటూ ఆదేశించారనీ సమాచారం. అమరావతితోపాటు ఇతర ప్రాజెక్టుల పనుల్లో ఇంతవరకూ జరిగిన ప్రోగ్రెస్ అంతా సీఎం సమీక్షించి, అనంతరం ఆయన తీసుకోబోయే నిర్ణయాల ప్రకారమే పనులు ముందుకు సాగే పరిస్థితి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో, జగన్ నిర్వహించబోయే సీఆర్డీయే సమీక్ష చాలా కీలకంగా మారనుందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.