స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా వైసీపీ ఇప్పుడు అడుగులు వేయబోతోంది. ఇదే ఊపు కొనసాగిద్దామంటూ పార్టీ ఎమ్మెల్యేలకు జగన్ దిశానిర్దేశం చేశారు. టీడీపీ కోలుకునే లోగానే స్థానిక ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేసేద్దామన్నారు. ఇందుకు పక్కా వ్యూహంతో ముందుకెళ్లాలని నిర్ణయించారు.
అసెంబ్లీ, లోక్సభ స్థానాలను గంపగుత్తుగా కైవసం చేసుకున్న వైసీపీ.. స్థానిక సంస్థలనూ ఇదే తరహాలో తన ఖాతాలో వేసుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. వాస్తవానికి సార్వత్రిక ఎన్నికలకు ముందే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. అయితే, కొన్ని కారణాల రీత్యా వాటిని వాయిదా వేశారు. మరో రెండు నెలల్లో ఈ ఎన్నికల జాతర ప్రారంభంకానుంది. ఇక, తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 151 అసెంబ్లీ, 22 ఎంపీ స్థానాలను తన ఖాతాలో వేసుకున్న వైసీపీ ఇదే ఊపును కొనసాగించి పంచాయతీ ఎన్నికల్లోనూ జయపతాకం ఎగురవేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్ తన పార్టీ తరఫున గెలుపొందిన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.
ఎన్నికల్లో తీవ్రంగా దెబ్బతిన్న టీడీపీ పుంజుకునేలోగానే స్థానిక ఎన్నికలు నిర్వహించి.. వైసీపీ సత్తా చాటాలని ఆయన పేర్కొన్నారు. ఊహించని స్థాయిలో వైసీపీకి వచ్చిన ఫలితాలు చూసిన టీడీపీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదన్నది జగన్ అంచనా. ఈ సమయంలోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తే.. మొత్తానికి మొత్తంగా జిల్లా, మండల పరిషత్, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకోవచ్చని.. పార్టీ కూడా సంస్థాగతంగా బలోపేతం కావచ్చన్న ఆలోచనలో జగన్ ఉన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ఫలితాలు ఏకపక్షంగా ఉండేలా ఇప్పటి నుంచే కార్యాచరణను సిద్ధం చేయాలని సూచించారు. స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీకి ఎక్కడా చోటు లేకుండా చేయాలని దిశానిర్దేశం చేశారు.
వైసీపీ అధ్యక్షుడు జగన్ వ్యూహం తెలుసుకున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే స్థానిక పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటి నుంచే కసరత్తును ప్రారంభిస్తామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే.. రాష్ట్రవ్యాప్తంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకత్వానికి బాధ్యతలు వస్తాయని అంటున్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలుంటాయని జగన్ చెప్పారంటే.. రెండు మూడు నెలల వ్యవధిలోనే ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే వీలుందని వైసీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఎన్నికల విజయంతో తామంతా జోష్తో ఉన్నామని.. తమ కార్యకర్తల్లోనూ ఆ ఉత్సాహం ఉందని, స్థానిక ఎన్నికలకు ఇదే సరైన సమయమని.. ఈ క్రతువును ఎంత త్వరగా ముగిస్తే వైసీపీకి అంత లాభిస్తుందని భావిస్తున్నారు.