ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగేది లేదని రాహుల్ గాంధీ భీష్మించుకుని కూర్చున్న సంగతి తెలిసిందే. ఇదే అంశం ఇవాళ్ల ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కూడా ప్రస్థావనకు వచ్చింది. పార్టీ అధ్యక్ష పదవిని వద్దంటున్న రాహుల్ ని… పార్లమెంటరీ పార్టీ నేతగా ఉండాలంటూ సభ్యులు కొంత పట్టుబట్టినట్టు తెలుస్తోంది. అయితే, అధ్యక్ష పదవినే వద్దనుకుంటున్నాననీ, అలాంటప్పుడు పార్లమెంటరీ పార్టీ నేతగా ఎలా కొనసాగుతానని రాహుల్ అన్నట్టుగా తెలుస్తోంది. రాహుల్ ని బుజ్జగించే ప్రయత్నాలు మరోసారి కూడా విఫలమయ్యాయని చెప్పొచ్చు. దీంతో రాహుల్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నిక అవుతారనే కథనాలకు చెక్ పడింది. దీంతో సోనియా గాంధీ ఈ బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది!
తాజా సమావేశంలో సోనియా పేరును మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రతిపాదించారు. అనంతరం సభ్యులందరూ ఆమెని పార్లమెంటరీ పార్టీ లీడర్ గా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం తీవ్ర చర్చనీయం అవుతున్న నాయకత్వ సమస్యపై పెద్దగా చర్చ జరగలేదు. నిజానికి, గతంలో పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కర్ణాటకకు చెందిన మల్లికార్జున ఖర్గే ఉన్నారు. గడచిన లోక్ సభ ఎన్నికల్లో ఆయన అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. దీంతో, పార్టీ అధ్యక్ష బాధ్యతలు వద్దంటున్న రాహుల్ కి ఈ అవకాశం ఇస్తారేమో అనే చర్చ జరిగింది. కాంగ్రెస్ నాయకులు కూడా అదే కోరుకున్నా కూడా… చివరికి సోనియా గాంధీకి ఈ బాధ్యతలు కట్టబెట్టారు.
పార్లమెంటరీ పార్టీ బాధ్యతలు తీసుకోవడానికి కాంగ్రెస్ లో ప్రత్యామ్నాయ నేతలు కూడా ఎవ్వరూ లేని పరిస్థితి. పార్టీ తరఫున గెలిచిన దాదాపు 50 మందిలో చాలామంది జూనియర్లు ఉండటం, గెలిచినవారిలో సీనియర్ల సంఖ్య గతంతో పోల్చితే తగ్గడం కూడా పార్టీకి మరో సమస్యగానే కనిపిస్తోంది. గతంలో మల్లికార్జున తరువాత డెప్యూటీ లీడర్ గా జ్యోతిరాదిత్య సింధియా ఉండేవారు. కానీ, ఆయన కూడా గడచిన ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో సోనియాకి ఉండాల్సిన పరిస్థితి అనివార్యమైంది. ఇంకోటి… ఇదే సమావేశంలో రాహుల్ గాంధీని అధ్యక్షుడిగా కొనసాగాలంటూ పార్లమెంటరీ పార్టీ మరోసారి తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని కూడా రాహుల్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చినట్టు సమాచారం.