ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్యనిషేధం విషయంలో.. ఎలాంటి అడుగు వేయాలో.. సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. దశల వారీగా మద్యనిషేధం అమలు చేసి.. 2024కి స్టార్ హోటళ్లలో మాత్రమే.. మద్యం ఉండేలా.. చూస్తానని.. మేనిఫెస్టోలో ప్రకటించారు. నవరత్నాల్లో అది కూడా ఒకటి. అందుకే.. ఆదాయార్జన శాఖలపై జరిగిన సమీక్షల్లో… ఎక్సైజ్ శాఖను ఇక నుంచి ఆదాయార్జన శాఖగా చూడవద్దని అధికారులకు సూచించారు. ప్రభుత్వ విధానం ప్రకారం… మద్యపానాన్ని నిరుత్సాహ పరిచేలా… మద్యం విధానం ఉండాలని… సూచించారు.
వచ్చే నెల నుంచే తొలి దశ మద్యనిషేధం..!
వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి లక్ష్యానికి పరిస్థితులు కూడా కలసి వస్తున్నాయి. ఈ నెలాఖరుతోనే మద్యం లైసెన్స్‌లు ముగుస్తున్నాయి. జూలై మొదటి తారీఖు నుంచి కొత్త విధానాన్ని ఖరారు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో… దశల వారీ మద్యనిషేధంలో… తొలి దశను అమలు చేయడానికి అవకాశం చిక్కింది. అందులో భాగంగా… అధికారులకు.. జగన్మోహన్ రెడ్డి కీలకమైన సూచనలు చేశారు. బెల్ట్ షాపులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. మద్యం ఆదాయాన్ని తగ్గిపోతే.. ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని ఆర్జించేందుకు ప్రయత్నించాలని జగన్ సూచించారు. ఈ విషయంలో దృష్టి పెట్టాలని..తర్వాతి సమీక్షలకు పూర్తి స్థాయిలో హాజరు కావాలని ఆదేశించారు.
ధరలు భారీగా పెంచడానికి రంగం సిద్ధం..!
తొలి దశలో భాగంగా… ఇరవై శాతం మద్యం దుకాణాలను తగ్గించడం, లైసెన్స్ ఫీజులను భారీగా పెంచడం, మద్యం ధరలను కూడా సామాన్యులకు అందుబాటులో లేకుండా పెంచడం వంటి చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. ఇలా చేయడం వల్ల.. ఆర్థిక భారం కారణంగా… మద్యపానం తగ్గుతుందని…ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అవసరం అయితే.. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తే… బెల్ట్ దుకాణాల అవసరం ఉండదని.. నిబంధనల ప్రకారం అమ్మవచ్చన్న అంచనాకు వస్తున్నారు. బహుశా.. మొదటి దశలో..ధరల పెంపునే…ప్రధానంగా చేసుకుంటారని భావిస్తున్నారు.
ధరల పెంపు ప్రజల్లోకి నెగెటివ్‌గా వెళ్తే..?
అయితే ధరలపెంపు అనేది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపుతుందన్న ఆందోళన వైసీపీ వర్గాల్లో ఉంది. తాగుడికి అలవాటు పడిన వారు.. ధరలు ఎక్కువని వెనక్కి తగ్గే అవకాశం ఉండదని..గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలను దోచేస్తున్నారనే అభిప్రాయం పెరిగిపోతుందని.. అది మంచి కాదని భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అనేక హామీలు ఇచ్చినందున..వాటిని అమలు చేయడానికి మద్యం అమ్మకాల ద్వారా ప్రజల దగ్గరే డబ్బులు వసూలు చేస్తున్నారన్న అభిప్రాయం ఏర్పడుతుందన్న ఆందోళన కూడా వైసీపీ వర్గాల్లో కనిపిస్తోంది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధ రత్నాన్ని ప్రజలకు అందించాలంటే… అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది.