ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐకి జనరల్ కన్సెంట్ను…పునరుద్ధరించే యోచనలో కొత్త సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో కటిఫ్ చెప్పిన తర్వాత.. చంద్రబాబు.. ఏపీలో సీబీఐ అవసరం లేదని..జనరల్ కన్సెంట్ను రద్దు చేశారు. దాంతో.. కోర్టు ఆదేశాలతో మాత్రమే సీబీఐ ఏపీలో అడుగుపెట్టే పరిస్థితి ఉంది. జనరల్ కన్సెంట్ రద్దు చేసిన తర్వాత.. అయేషా మీరా హత్య కేసులో.. సాక్ష్యాల ధ్వంసం..ఇతర అంశాలతో.. హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు సీబీఐ అధికారులు విచారణ కూడా జరుపుతున్నారు. కొద్ది రోజుల క్రితం.. తెనాలిలో ఓ ఐటీ అధికారిపై సీబీఐ అధికారులు దాడులు చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా.. ఇలా దాడులు చేయడం వివాదాస్పదం కావడంతో… కేసును .. ఏపీ ఏసీబీకి అప్పగించి చేతులు దులుపుకున్నారు.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో.. సీబీఐకి ఇచ్చిన జనరల్ కన్సెంట్ను రద్దు చేయాలనే ఆలోచన చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై.. వైసీపీలోనే రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం అవినీతిని వెలికి తీసే క్రమంలో సీబీఐ దర్యాప్తులు చేయించాలన్న లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని.. ఆ మేరకు సిఫార్సులు చేసే ముందు… జనరల్ కన్సెంట్ రద్దు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. అందుకే.. జగన్మోహన్ రెడ్డి కూడా.. జనరల్ కన్సెంట్ రద్దు చేయడానికే ఆసక్తిగా ఉన్నారని అంటున్నారు. టీడీపీ హయాంలో… భారీగా అవినీతి జరిగిందని.. ఆ అవినీతిని సీబీఐ ద్వారానే దర్యాప్తు చేయించాలన్న పట్టుదలతో జగన్ ఉన్నారు. అమరావతి విషయంలో.. అనేక అక్రమాలు జరిగాయని.. సీబీఐ దర్యాప్తు చేయాలని గతంలోనే వైసీపీ డిమాండ్ చేసింది. ఇప్పుడు తామే అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ సిఫార్సు చేసే అవకాశం ఉంది.
అయితే.. కొంత మంది వైసీపీ నేతలు మాత్రం కీడెంచి మేలెంచాలన్న ఆలోచనను హైకమాండ్ ముందుంచుతున్నట్లు సమాచారం. బీజేపీ నేతలు… ఇతర పార్టీల నేతలను డీల్ చేసే విషయంలో… కేంద్ర దర్యాప్తు సంస్థలనే ప్రధానంగా వినియోగించుకుంటున్నారు. గత ఐదేళ్ల కాలంలో అదే జరిగింది. ఇప్పుడంటే బీజేపీతో వైసీపీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కానీ భవిష్యత్‌లోనూ ఇలాగే ఉండాలని లేదు. ఎందుకంటే.. ఏపీ ప్రయోజనాల విషయంలో.. ముఖ్యమంత్రి రాజీపడాల్సి వస్తే అది ప్రజల్లోకి నెగెటివ్ గా వెళ్తుంది. ఎంతో కొంత ప్రశ్నించాల్సిన పరిస్థితి వస్తుంది. పైగా.. జగన్ పై ఉన్న సీబీఐ కేసులు.. ఇతర అంశాల కారణంగా… బీజేపీ నేతలు అడ్వాంటేజ్ తీసుకుంటే… చేజేతులా.. కేంద్రానికి అవకాశం ఇచ్చినట్లు ఉంటుందన్న ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైతే జగన్మోహన్ రెడ్డి… టీడీపీ నేతల అవినీతి సంగతి తేల్చాలనుకుంటున్నారు కాబట్టి… కేంద్రానికి జనరల్ కన్సెంట్ను పునరుద్దరించే అవకాశం ఉంది. తర్వాత ఎప్పుడైనా మరీ ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే.. అప్పుడు మళ్లీ రద్దు చేయవచ్చన్న… భావన సీనియర్ నేతల్లో ఉంది. టీడీపీ నేతల అవినీతిపై.. ఏసీబీతోనే..విజిలెన్స్ తోనే దర్యాప్తు చేయిస్తే.. అంత సీరియస్ నెస్ ఉండదు కాబట్టి.. సీబీఐనే బెటరని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.