సినిమాల్లో బూతులు తిట్టుకోవడం ట్రెండ్. కాలర్ ఎగరేయడం, అడ్డొచ్చిన వాడ్ని కొట్టడం మాసిజం.. అదే హీరోయిజం. అయితే దాన్నే నిజ జీవితంలోనూ రిపీట్ చేయాలనుకోవడం మూర్ఖత్వం, తల పొగరెక్కిన వ్యవహారం. ‘ఫలక్‌నుమా దాస్’ హీరో విశ్వక్ సేన్‌కి ఈ విషయం అర్థమయ్యిందో.. లేదో..
విశ్వక్ సేన్ నటించిన చిత్రం ‘ఫలక్ నుమాదాస్’. దానికి ఆయనే దర్శకుడు, నిర్మాత కూడా. సినిమాలో ఏమాత్రం విషయం లేదని విమర్శకులు తేల్చేశారు. కాకపోతే… వసూళ్లు బాగున్నాయి. అవి చూసి మనోడు వీర లెవిల్లో రెచ్చిపోతూ ర్యాలీలు మొదలెట్టాడు. ఈ సినిమాలో చాలా బూతులు కనిపిస్తాయి. టీజర్, ట్రైలర్లలో శాంపిల్స్ వినిపించాయి కూడా. `**గితే.. షేపవుట్ అయిపోతావ్` అనే డైలాగ్ ఉంది ఈ సినిమాలో. దాన్నే సెన్సార్ బీప్ వేసింది. ఆ డైలాగ్‌ని బయటా వాడేస్తున్నాడు విశ్వక్. ఈ సినిమాకొచ్చిన, వస్తున్న వసూళ్లు చూసి విర్రవీగాడేమో.. `**గితే బాక్సాఫీసు షేపవుట్ అయిపోతుంది` అంటూ ఇన్‌స్ట్రాగ్రామ్ లో ఓ పిక్ పోస్ట్ చేశాడు.
దాంతో… అతని ఫాలోవర్స్ ఓ రేంజులో విరుచుకుపడుతున్నాడు. బాక్సాఫీసుని షేక్ చేసే సినిమాలు చాలా వచ్చాయి. భవిష్యత్తులోనూ వస్తాయి. కానీ ఈ రేంజులో బాక్సాఫీసు అనే పదాన్ని ఎవ్వరూ అనుమానించి ఉండరు. అది సినిమాలో డైలాగే కావొచ్చు. ఆ డైలాగు చూసి, విని థియేటర్లలో పూనకాలు వచ్చి ఊగిపోయేంత జనం ఉండొచ్చు. కానీ.. సోషల్ మీడియాలోనూ సభ్యత, సంస్కారాలుంటాయి. సినిమా ఓ కళారంగమని, బాక్సాఫీసు అనే పదాన్ని గౌరవించాలని ఈ హీరోకి తెలియకపోతే ఎలా? విశ్వక్ సేన్ ఆటిట్యూడ్ ముందు నుంచీ ఇలానే ఉంది. ఈమధ్య ఇంటర్వ్యూ కోసం మీడియా ముందుకొచ్చి ‘ఆ.. ఏం చెప్పమంటారు’ అంటూ మీడియానే రివర్స్ లో క్వశ్చన్ వేసి తన ఆటిట్యూడ్ చూపించుకున్నాడు. ఓ సందర్భంలో విజయ్ దేవరకొండపై సెటైర్లు కూడా వేశాడు. తన తొలి సినిమా `ఈ నగరానికి ఏమైంది` ఫ్లాప్. `ఫలక్ నుమాదాస్` హిట్టో కాదో ఇంకా తెలీదు. ఈ మాత్రం దానికే ఇంత విర్రవీగాలా అన్నది సగటు సినీ ప్రేక్షకుడి ప్రశ్న.
https://www.instagram.com/p/ByF_K1-pBid/