ఇప్పటికీ చాలా గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లో కూడా సర్కారీ బడుల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. మౌలిక వసతుల సమస్య ఎప్పుడూ వెంటాడుతూనే ఉంది. సిబ్బంది కొరత, నాణ్యమైన విద్య, సరైన ఉపకరణాలు లేకపోవడం.. ఇలా సమస్యలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల సమస్యలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. పాఠశాల్లలోని మౌలిక వసతులతోపాటు విద్యా విధానంపై కూడా ఆయన ప్రత్యేక దృష్టిపెట్టారు. 44 వేల స్కూళ్లలో మౌలిక సదుపాయాల సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. ఈ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను కూడా ప్రవేశపెట్టాలని చెప్పారు. దీంతోపాటు, తెలుగు బోధన కూడా తప్పనిసరిగా ఉండాలన్నారు.
మధ్యాహ్న భోజన పథకం అమలుపై సమీక్షించిన సీఎం జగన్… ఈ పథకం అమలు కోసం పనిచేస్తున్న కార్మికుల వేతనాలను రూ. 1000 నుంచి రూ. 3000కు పెంచాలని నిర్ణయించారు. మధ్యాహ్నం భోజనం కోసం ఆధునికమైన వంటగదులు ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులపై ఫొటోలు తీయించి, సమగ్ర నివేదిక తయారు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మరుగుదొడ్లు, ప్రహారీ గోడలు, పిల్లలు ఆడుకునేందుకు గ్రౌండ్, తరగతి గదుల్లో ఫ్యానులు, బ్లాక్ బోర్డులు, విద్యార్థులు కూర్చునేందుకు బెంచీలు… ఇలా పాఠశాలకు సంబంధించిన ప్రతీ అంశంపైన ప్రత్యేక దృష్టి చర్యలు తీసుకోవాలన్నారు. విద్యాశాఖ అధికారులతో తాజాగా జరిగిన సమీక్షలో ఈ అంశాలపై జగన్ స్పందించారు. ఈ అంశంపై మరోసారి సమీక్ష ఉంటుందనీ, అప్పటికి సమగ్ర నివేదికలతోపాటు విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు అవసరమైన సూచనలు అధికారుల చేయాలని కోరారు.
త్వరలో ప్రారంభం కాబోతున్న విద్యా సంవత్సరం నుంచే ప్రతీ శనివారం నో బ్యాగ్ డేని అమలు చేయాలని ప్రయత్నిస్తున్నారు. అంటే, శనివారం పుస్తకాలు లేకుండా పిల్లలు బడికి వెళ్లడం. అంటే, వారంలో ఒకరోజు పుస్తకాల మోత లేకుండా… రోజువారీ తరగతులకు భిన్నంగా ఆటపాట ద్వారానే పాఠాలు చెప్పాలనేది ఆలోచన. దీని వల్ల స్కూలుకి వెళ్లాలన్న ఉత్సాహం విద్యార్థుల్లో పెరుగుతుంది, ఇతర నైపుణ్యాల్లో పిల్లల టాలెంట్ బయటపడే అవకాశం ఉంటుంది. పాఠశాలల్లో ఆనంద వేదికలు పెట్టాలనీ, ప్రతీరోజూ ఓ అర్ధగంటపాటు నిర్వహించాలనీ భావిస్తున్నారు. బడి అంటే పిల్లలకు భయం పోగొట్టి, హాయిగా ఆడుతూ పాడుతూ చదువుకోవచ్చు అనే అభిప్రాయం వారిలో కలిగించేలా చర్యలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. నిజానికి, సర్కారు బడులను తీర్చిదిద్దితే… చదువు ఖర్చుల భారం నుంచి ఎన్నో కుటుంబాలకు విముక్తి లభించినట్టు అవుతుంది.