రాజకీయ విశ్లేషణల్లో తనదైన ప్రత్యేకత చూపే.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. ఈ వారం.. భవిష్యత్ రాజకీయాలను కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో మరోసారి నరేంద్రమోడీ ప్రధానమంత్రి కావడం… నెంబర్ టూగా అమిత్ షా పదవి చేపట్టడంతో.. జరగబోతోంది ఏమిటో… రాధాకృష్ణ ప్రతీ వారాంతంలో.. రాసే “కొత్తపలుకు” శీర్షికలో విశ్లేషించారు.
2024లో ప్రధానిగా అమిత్ షా..!
ప్రధానిగా మోడీ రెండుసార్లు మాత్రమే ఉంటారని… వేమూరి రాధాకృష్ణ చెప్పారు. మోడీ ఎప్పుడు.. ఏ సందర్భంలో… ఈ మాట అన్నారో కానీ.. మీడియా హైలెట్ చేయలేదు. కానీ రాధాకృష్ణ మాత్రం.. దీన్ని హైలెట్ చేసి… తర్వాత కాబోయే ప్రధాని అమిత్ షా అని తేల్చేశారు. 2024 తర్వాత రాష్టపతి పదవిని మోదీ స్వీకరించరని… ప్రధాని పదవిలో అమిత్‌షాను కూర్చోబెడతారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ వర్గాలు కూడా అవననే అంటున్నాయంటున్నారు. నిజానికి అమిత్ షా కు హోంమంత్రి పదవి ఇచ్చినప్పటి నుంచి.. జాతీయ మీడియా కూడా.. ఆయనను బీజేపీ వారసుడిగానే ప్రచారం చేస్తున్నాయి.
చంద్రబాబును అరెస్ట్ చేసి … టీడీపీని కలిపేసుకుంటారా..?
భారతీయ జనతా పార్టీకి కొరుకుడు పడని రాష్ట్రాలు గా ఇప్పటి వరకూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది. విడిపోయిన తర్వాత తెలంగాణలో పాగా వేసేందుకు చేయగలిగినదంతా చేస్తోంది. రెండోసారి అధికారం దక్కినందున… వచ్చే ఐదేళ్లోల తెలుగు రాష్ట్రాలే లక్ష్యంగా బీజేపీ రాజకీయం చేయబోతోందని.. రాధాకృష్ణ చెబుతున్నారు. టీడీపీ, టీఆర్ఎస్ టార్గెట్‌గా బీజేపీ పక్కాగా స్కెచ్ వేస్తున్నారని… జగన్ సహకారంతో ప్లాన్ అమలుచేయబోతోందని… అంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబే బీజేపీ తొలి టార్గెట్ అని తేల్చారు. ఐదేళ్ల పాలనలో ఏదో అక్రమం పేరుతో.. ఆయనపై కేసులు పెట్టి.. జైలుకు పంపి.. ఇతర పార్టీ నేతల్ని.. బీజేపీలో కలిపేసుకుంటే.. పనైపోతుందనేది బీజేపీ ప్లానట.
లైన్లో జగనూ ఉంటారట..!
ముందుగా.. టీడీపీ పని పట్టిన తర్వాత బీజేపీ నేతలు.. చివరిగా.. జగన్ పై దృష్టి పెడతారని వేమూరి రాధాకృష్ణ చెబుతున్నారు. ఏపీలో బలపడ్డామని విశ్వాసం కుదిరాక జగన్‌పై బీజేపీ దృష్టి పెడుతుందంటున్నారు. ఆ తర్వాత జగన్‌ని దెబ్బతీయడం బీజేపీ చేతిలో పనిగా తేల్చారు. ఏపీలో నియామకాల్లో క్రైస్తవులకు ప్రాధాన్యం దక్కుతోందని… దీన్ని నిశితంగా ఆర్.ఎస్.ఎస్ పెద్దలు గమనిస్తున్నారని అంటున్నారు. జగన్‌ని వాడుకుని వదిలేద్దామన్న యోచనలో బీజేపీ ఉందంటున్నారు. ఆయనపై ఉన్న కేసులో… వచ్చే ఎన్నికల కంటే ముందే జైలుకు పంపే ప్లాన్‌లో కూడా బీజేపీ పెద్దలు ఉన్నారంటున్నారు.